ఏ రాష్ట్రం ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే: సచివాలయ ఉద్యోగులు

 

కమలనాథన్ కమిటీ తన మార్గదర్శకాలను వెల్లడి చేసిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు స్పందించారు. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రం ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే వుంచాలని కోరారు. అవసరం అనుకుంటే దానికోసం సూపర్ న్యూమరిక్ పోస్టులనైనా సృష్టించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మురళీకృ‌ష్ణ అన్నారు. ఉద్యోగులు అధికంగా వున్నారనే కారణాన్ని చూపించి జూనియర్లను ఇతర రాష్ట్రాలకు పంపడాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఉద్యోగుల విభజనను షెడ్యూలు ప్రకారమే పూర్తి చేయాలని కోరారు. స్థానికతను ఆర్టికల్ 371 (డి) ప్రకారం నిర్ణయించడం, భార్యాభర్తలు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులకు ఆప్షన్లు ఇవ్వడాన్ని సచివాలయ ఉద్యోగులు సమర్థించారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని క్లాజ్‌ ఎఫ్‌ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని సచివాలయ ఉద్యోగుల ఫోరం కో-చైర్మన్‌ మురళీమోహన్‌ అన్నారు. ఈ క్లాజు తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులకు, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందికరమన్నారు.