TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దల సభకు భారతీయుడు !

Published on: Fri May 30, 2025 3:05PM

 

రాజకీయ, సినిమా రంగాల సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ, సినిమా రంగాలు పాలు నీళ్ళలా కలిసి పోయాయి. తమిళ రాజకీయాలు అనగానే తెరఫై కొచ్చే, మాజీ ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత మొదలు ద్రవిడ పార్టీల ముఖ్య నాయకులు చాలావరకు, సిల్వర్ స్క్రీన్’ తో ఓ వెలుగు వెలిగినవారో, వెలుగుతున్నవారో అవుతారు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్’ రాజకీయ స్టేజిపైనే కానీ, సిల్వర్ స్క్రీన్ పై నటించిన అనుభవం ఉండకపోవచ్చును.

 కానీ,ఆయన తండ్రి మాజీ ముఖ్యమత్రి కరుణానిధి,కుమారుడు,ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ ఇద్దరూ, వెండి తెర వెలుగులే... ముఖ్యమంత్రి  స్టాలిన్’ కు కూడా సినిమా రంగంతో డైరెక్ట్ లింక్స్ లేక పోవచ్చేమో కానీ, పరోక్ష బంధాలు లేకుండా ఉండవు. అదలా ఉంటే, ఇప్పడు తమిళనాడు నుంఛి మరో ప్రముఖ నటుడు,రాజకీయ చిత్రం ‘భారతీయుడు’ సినిమా ఫ్రేమ్’  కమల్ హసన్’ అధికార డిఎంకే మద్దతుతో రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. కమల హసన్’ తమిళ సినిమా ద్వారా బాల నటుడిగా పరిచయం అయినా, ఆ తర్వాత  తెలుగు’, హిందీ, కనడ భాషలు సహా అనేక భాషా చిత్రాల్లో నటించారు. బహు బాషా నటుడిగా గుర్తింపు, గౌరవం పొందారు. పురస్కారాలు అందుకున్నారు.కమల్ హసన్ వ్యక్తిగత జీవితంలో కొన్ని మచ్చలు, మరకలు ఉన్నా, సినిమా నటుడిగా మాత్రం ఆయన అద్భుత ప్రతిభను చూపారు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ హసన్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు అందుకున్నారు.

2014లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.ఇక కమల్ హసన్ రాజకీయాల విషయానికి వస్తే, 2018లో అనూహ్యంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. నిజానికి, ఆ సమయంలో మరో ప్రముఖ తమిళ హీరో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న ముమ్మర ప్రచారం జరుగతున్న సమయంలో ఆయన ఎందుకో వెనక్కు తగ్గారు. ఆ సమయంలో కమల్ హసన్’ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుంచి వామ పక్ష భావాలున్న వ్యక్తిగా, కూడా కమల్ హాసన్’  అదే అదే ఐడియాలజీతో సొంత పార్టీని తెరపైకి తెచ్చారు. రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో మార్పు కోసం, ‘మార్పే’ లక్ష్యంగా., మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించారు. అయితే,పార్టీ పెట్టినప్పటి నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం పోటీచేసింది. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ ఓడిపోయింది. కనీసం, ఓ చిన్న గెలుపు కూడా దక్కలేదు. హిట్’ అన్నదే లేకుండా ప్రతి ఎన్నికల్లోనూ హీరో పార్టీ జీరోగా మిగిలింది. 

చివరకు, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆశయంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హసన్’ స్వయంగా కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు. అక్కడితో ఆయనకు, సినిమా, రాజకీయం ఒకటి కాదనే తత్త్వం బోధపడింది. ఇక చేసేది లేక చివరకు 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు  ఇండియా కూటమిలో చేరారు. ఎన్నికలలో పోటీ  చేయలేదు కానీ, డిఎంకేకు మద్దతు ఇచ్చారు. డిఎంకే అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు.అందుకు పారితోషికంగా కాదంటే ప్రతిఫలంగా ఆయన్ని రాజ్య సభకు పంపేందుకు అధికార డీఎంకే పార్టీ నిర్ణయించింది.తమిళనాడులో జులై 2025లో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ సీట్లలో నాలుగు డీఎంకే కూటమికి, రెండు అన్నాడీఎంకే కూటమికి దక్కే అవకాశం ఉంది. డీఎంకే తమ నాలుగు సీట్లలో ఒకదాన్ని కమల్ హాసన్‌కు కేటాయించింది. సో.. చివరాఖరుకు చట్ట సభలో కాలు పెట్టాలన్న భారతీయుడదు, కమల హసన్ కల,ఈ విధంగా నెరవేరుతోంది. 


రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, జరగనున్నాయి.నామినేషన్ల ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, ఈ మధ్యనే రాజకీయ అరంగేట్రం చేసిన మరో తమిళ హీరో, టీవీకే పార్టీ విజయన్’కు బీజేపీ వల విసిరింది. డిఎంకే అవినీతి పాలనను అంతమొందిచడమే ఇరు పార్టీల లక్ష్యం కాబట్టి,విజయన్ ఎన్డీఎలో చేరాలని, తమిళనాడు బీజేపే అధ్యక్షుడు, నయినార్‌ నాగేంద్రన్‌ .. విజయన్ను  ఆహ్వానించారు. హీరోగారూ అవినీతి డిఎంకే పార్టీని ఓడిద్దాం,మా కూటమిలోకి రండి,, అంటూ బహిరంగ ఆహ్వానం పలికారు. అయితే, విజయన్ పార్టీ పెట్టింది మొదలు, బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. సో .. ఇప్పడు ఆయన తమ స్టాండ్ మార్చుకుని బీజేపీతో జట్టు కడతారా? ఎన్డీఎ కూటమిలో చేరతారా? అనేది తేలవలసి వుంది. కాగా, విజయన్’ను ఎన్డీఎ కుతమిలోకి తెచ్చేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’తో పాటుగా, తెలుగు దేశం పార్టీతో సంనిహతంగా ఉండే మరి కొందరు సినిమా ప్రముఖులు ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది.