కమల్.. చంద్రబాబును దువ్వుతున్నాడా..?

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభిమానులు పెరుగుతున్నారు. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. సీఎంగా ప్రజారంజక పాలన, సమస్యలను సైతం సవాళ్లుగా తీసుకుని.. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఆయన పనితీరే అందుకు కారణం. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సంస్కరణలు, అడ్మినిస్ట్రేషన్, ఐటీ హంగులతో హైటెక్ సీఎంగా.. సీఈవో ఆఫ్ ది స్టేట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రబాబు. ఈ విధానాలతో ఆనాడు దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులకు మార్గదర్శిగా నిలిచారు. ఇక వ్యూహ, ప్రతివ్యూహాలు, రాజకీయ చతురతలో చంద్రబాబును అపర చాణుక్యుడిగా పేర్కొంటారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి బాబు జీవితం ఒక పాఠం.

 

తాజాగా తమిళనాట కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సినీనటుడు కమల్‌హాసన్ తనకు చంద్రబాబు హీరో అని వ్యాఖ్యానించారు. ఇప్పుడే కాదు గతంలో ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కమల్.. టీడీపీ అధినేతను ఆకాశానికెత్తేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలే బలమైనవని.. కానీ దేశసమైక్యత కోసం రీజనల్ పార్టీలు.. నేషనల్ పార్టీలతో కలిసి పనిచేయాలని.. అవసరమైతే హక్కుల కోసం తిరగబడాలని చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ- ప్రాంతీయ పార్టీల మధ్య వుండాల్సిన సంబంధం ఇదీ అని చంద్రబాబు దేశానికి తెలియ చేసారని.. మిత్ర పక్షంగా ఉంటూనే హక్కుల కోసం పోరాడటం, బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని చాలా ఖచ్చితం గా ప్రశ్నించడాన్ని దేశంలోని ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు.

 

2014కు ముందు ఏదో చేస్తాడని.. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలుపుతాడని.. కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా, పాక్‌లకు ధీటైన జవాబిస్తాడని సోషల్ మీడియాలో "నమో.. నమో.. నమో" అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది అంతా సవ్యంగానే జరుగుతోందన్న భ్రమలు కల్పించినా.. ఆ తర్వాతి ఏడాదికి సగటు భారతీయుడికి వాస్తవం తెలిసొచ్చింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకింగ్ రంగంపై ఆంక్షలు ఇలా ప్రతి అంశమూ.. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడంతో మోడీ ప్రభ నానాటికీ తగ్గిపోతోంది. దానికి తోడు తన మాట వినని వారిని నరేంద్రుడు ఏం చేస్తున్నాడో రోజూ చూస్తూనే ఉన్నాం.

 

విభ‌జ‌న హామీల విష‌యంలో బీజేపీతో చంద్ర‌బాబు క‌య్యానికి కాలుదువ్వుతున్న స‌మ‌యంలో.. మోడీని ఢీకొనే స‌రైన నేత‌గా బాబుకు జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇప్పుడు బాబు నా రోల్ మోడల్ అని చెప్పడం ద్వారా.. కమల్ హాసన్ జాతీయ స్థాయిలో కొత్త సమీకరణలకు తెరలేపాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు తృతీయ ఫ్రంట్‌కు పూనుకుంటే.. దానిలో తనకూ స్థానం కల్పించాలని యూనివర్శిల్ హీరో ముందుగానే.. ఏపీ ముఖ్యమంత్రిని దువ్వుతున్నాడా అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.