ఎమ్మెల్యే బరిలో కవిత.. రంగంలోకి హరీష్ రావు

 

ఇటీవల నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత భవిష్యత్తు ఏమిటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  అయితే కవిత హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ లో కవిత ఓటమితో కేసీఆర్ నైరాశ్యంలో కూరుకుపోయారట. తన కూతురును ఎలాగైనా సరే.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. మొదట ఆమెను రాజ్యసభకు పంపిద్దామనుకున్నారట. కానీ, అలా దొడ్డిదారిన వెళితే విశ్వసనీయత ఉండదన్న భావనతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారట. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తేనే సత్తా చాటుకున్నట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కవితను హుజూర్ నగర్ ఎమ్మెల్యే నిలపాలని భావిస్తున్నారట.

హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా కూడా గెలిచారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. దీంతో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కవితను నిలబెట్టాలని, ఆమెను గెలిపించే బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అంతేకాదు కవిత గెలవగానే, మహిళా కోటాలో మంత్రి పదవి కూడా ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.