TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ ను ఆస్పత్రిలో పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Published on: Fri Jul 4, 2025 2:10PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్వస్థతకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో గురువారం (జులై3 ) చేరిన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శుక్రవారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, అయితు రక్తంలో సుగర్ స్థాయిలు ఎక్కువగానూ, సోడియం లెవెల్స్ తక్కువగానూ ఉన్నాయని పేర్కొన్నారు. అవి సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ మరో రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంటారని ఈ హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు. ఆ తరువాత కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కూడా హెల్త్ బులిటిన్ లో డాక్టర్లు పేర్కొన్న అంశాలనే పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ... ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 

అదలా ఉంటే కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం (జులై 4) యశోదా ఆస్పత్రికి వచ్చి తండ్రిని పరామర్శించారు. ఇటీవలి కాలంలో కవిత పార్టీ లైన్ ను ధిక్కరించి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ.. జాగృతి బ్యానర్ కింద కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ముఖ్యంగా ఆమె తండ్రికి రాసిన లేఖ లీక్ అయిన తరువాత నుంచీ కేసీఆర్ ఆమె పట్ల ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న సమయంలో ఆయనను కలవడానికి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితను కనీసం పలకరించను కూడా పలకరించలేదని వార్తలు వినవచ్చిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.