కవితకు మళ్లీ నిరాశే!
Published on: Tue Aug 20, 2024 12:01PM
తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. ఆమె బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.కవిత బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు మంగళవారం ( ఆగస్టు 20) విచారణకు వచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గత కొన్ని నెలలుగా తె తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా సుప్రీం కోర్టులో ఆమె దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సర్వోన్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అదే విధంగా కవితకూ బెయిలు మంజూరు చేయాలని కోరారు. సుప్రీం కోర్టులో కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. కాగా కవిత కు బెయిలు మంజూరు చేయవద్దంటూ కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీ సమయం కోరింది. దీంతో కవిత బెయిలు పిటిషన్ విచారణను సర్వోన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
దీంతో కవితకు బెయిలు లభించేదీ లేనిదీ తేలాలంటే మరో వారం రోజులు వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా కవితకు బెయిలు లభిస్తుందన్న ఆశాభావంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి రెడీ అయ్యాయి. ఆమెను తోడ్కొని వచ్చేందుకు బిఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ , నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీ చేరుకున్నారు. అయితే బెయిలు పిటిషన్ విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడటంతో వారంతా నిరాశ చెందారు.


