కేసీఆర్ సెక్రటేరియట్‌ను అందుకే కూలుస్తున్నాడా..?

తెలంగాణ సెక్రటేరియట్‌ను కూల్చేదాకా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిద్రపట్టేలా కనిపించడం లేదు. తెలంగాణ తొలి ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన గుర్తులను ఒక్కొక్కటిగా చేరిపేస్తూ వస్తోన్న ఆయన కన్ను సచివాలయ భవనాలపై పడింది. సెక్రటేరియట్ శిథిలావస్థకు చేరుకుందని.. సిబ్బందికి అనువుగా లేదని దానిని కూల్చేసి అందరికి అందుబాటులో ఉండే మరో ప్రాంతంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కేసీఆర్‌ను ముందు నుంచి గమనిస్తున్నవారు మాత్రం ఆయనకు జాతకాలు, ముహుర్తాలు, వాస్తు శాస్త్రాలపై నమ్మకం ఎక్కువని.. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే సచివాలయాన్ని కూలగొడుతున్నారని చర్చించుకున్నారు.

 

తన వాస్తు పిచ్చిని కవర్ చేసుకోవడానికి "భద్రత లేనందున" అనే ట్యాగ్ లైన్ తగిలించారు. సచివాలయ భవనాలకు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లేదని.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ ఈ వాదనకు సపోర్ట్‌గా ఫైర్ డిపార్ట్‌మెంట్ చేత సర్టిఫికేషన్ ఇప్పించారు. అయితే భవనాలను కూల్చాలనే కేసీఆర్ పంతం వెనుక మరో బలమైన కారణాన్ని తెరపైకి తెస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే సీఎం భవనాలను కూల్చాలని నిర్ణయించారట. అందుకు వారు ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. ఈ సచివాలయం నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కొడుకులు ముఖ్యమంత్రలైన చరిత్ర లేదు..

 

నీలం సంజీవరెడ్డి మొదలుకొని రాజశేఖర్ రెడ్డి దాకా ఈ భవనాల వాస్తు తండ్రులకే అనుకూలించింది తప్ప కొడుకులెవరూ సీఎంలు కాలేదని కేసీఆర్ గమనించారట. పాత తరాన్ని పక్కనబెడితే పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ అధినేతగా, ప్రధానిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు కానీ ఆయన వారసులు ఎంపీ పదవితోనే సరిపెట్టుకున్నారు. చెన్నారెడ్డి సీఎంగా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. ఆయన వారసుడు మర్రి శశిథర్ రెడ్డి చెప్పుకొదగ్గ నేత కాలేకపోయారు. జలగం వెంగళరావు సీఎంగా, కేంద్రమంత్రిగా పనిచేయగా.. ఆయన కుమారుడు జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, రైల్వే సహాయమంత్రిగా పనిచేసి ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలా..? వద్దా అన్న దశకు చేరుకున్నారు.
 

ఇక తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించి... జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన స్వర్గీయ ఎన్టీఆర్ వారసులు ఎవరూ ఆ స్థాయిని అందుకోలేకపోయారు.. తిరుగులేని నాయకుడిగా ప్రజల్లో స్థానం సంపాదించుకున్న వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్‌కి 150 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నప్పటికీ సీఎం కాలేకపోయారు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న గులాబీ బాస్.. సెక్రటేరియట్ భవనాల వాస్తు కొడుకులకు అనుకూలంగా లేదని భావించారు. అందుకే కేటీఆర్‌‌కు బాగా అనుకూలంగా ఉండే వాస్తు ప్రకారం కొత్త భవనాలను నిర్మించాలనుకుంటున్నారట. తన తర్వాత కొడుకు సీఎం కావాలనుకోవడం తప్పుకాదు కానీ.. అందుకోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి వాస్తునే సరిచేసి మరీ తనయుణ్ని అందలం ఎక్కించాలనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన సచివాలయ భవనాలను కూలుస్తే చూస్తూ ఊరుకోం అంటున్నాయి ప్రతిపక్షాలు. మరి ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గని వ్యక్తిత్వం కల కేసీఆర్‌ తన పంతాన్ని ఎలా నెగ్గించుకుంటారో వేచి చూద్దాం.