కాళేశ్వరంకు జాతీయ హోదా అర్హత లేదు.. తేల్చేసిన కేంద్రం
Published on: Fri Jul 22, 2022 11:52AM
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల్లోని డొల్ల తనం ఇటీవలి వరదలు బయట పెట్టేశాయి. కాళేశ్వరం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నానా తంటాలూ పడుతూ పోలవరం ప్రాజెక్టు ను తెరపైకి తీసుకువచ్చి సెంటిమెంట్ తో కొడదామన్న కేసీఆర్ ప్రయత్నాలకు అనుకోని విధంగా ఎదురు దెబ్బ తగిలింది.
లోక్ సభ సాక్షిగా కేంద్రం కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గాలిని పూర్తిగా తీసేసింది. లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకుకేంద్ర జలశక్తి శాఖ మంత్రి తుడు ఇచ్చిన జవాబుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రశక్తే లేదని తేటతెల్లమైపోయింది. ఆయన ఇచ్చిన జవాబుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపుగా ఏ అనుమతులూ లేవనీ తేలిపోయింది. కేవలం రీ డిజైనింగ్ తో ప్రాజెక్టు నిర్మించేశారనీ, ఆ ప్రాజెక్టు పెట్టుబడులకు కేంద్రం నుంచి క్లియరెన్స్ లేదనీ మంత్రి పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఒక విధంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని తేల్చేశారని చెప్పవచ్చు. ఇంత కాలంగా రాష్ట్రంలో విపక్షాలు అటువంటి విమర్శలే చేస్తున్నారు. కేంద్ర మంత్రి లోక్ సభ సాక్షిగా ఇచ్చిన లిఖిత పూర్వక హామీతో కాళేశ్వరంకు జాతీయ హోదా అన్నది అసలు పరిగణనలోనే లేదని తేటతెల్లమైపోయింది.
మామూలు పరిస్థితుల్లో అయితే తెరాస కేంద్ర మంత్రి సమాధానంపై మిన్నూ మన్నూ ఏకమయ్యేలా తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం అంటూ విమర్శల నిప్పులు చెరిగేసేది.. కానీ ఇప్పుడు తెరాస డిఫెన్స్ లో ఉంది. కేంద్ర మంత్రి లేఖను అవకాశంగా తీసుకుని కేంద్రంపై విమర్శలతో చెలరేగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉంది. ఇటీవలి వరదలకు కాళేశ్వరం ముంపునకు గురి కావడమే కాకుండా పంప్ హౌస్ లు, మోటార్లు నీట మునిగి పనికి రాకుండా పోయాయి. అవి ఎప్పటికి పునరుద్ధరింబడతాయో తెలియదు. అసలు అవి మళ్లీ పని చేస్తాయా అన్న ప్రశ్నకు ఇరిగేషన్ అధికారులే సరైన సమాధానం ఇవ్వలేక నీళ్లు నములుతున్నారు. వాటికి మరమ్మతులు చేయడం అయ్యే పని కాదని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు.
వాటికి మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుందని మరి కొందరు అంటున్నారు. నీటి పారుదల శాఖ అధికారులైతే మరో ఆరు నెలల వరకూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మర్చిపోవడమే మంచిదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో సరైన అనుమతులు లేకుండానే, రీడిజైనింగ్ అంటూ కాళేశ్వరంనిర్మించేశారనీ, దానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశమే లేదనీ కేంద్రం స్పష్టం చేసేసింది. దీంతో ఇప్పటి వరకూ పోలవరంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ కు కేంద్రం మరింత పదునైన అస్త్రం అందించినట్లైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాశారని చెప్పారని, అయితే ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఆ అనుమతులు ఉంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంటుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
కానీ ఇవేమీ లేకుండా కేసీఆర్ రీ డిజైనింగ్ చేసి ప్రాజెక్ట్ నిర్మించారని ఆయన చెప్పకనే చెప్పారు. ఇంకా చెప్పాలంటే నేరుగా అనకుండానే కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టని తేల్చేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు తెరాసపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెరాసపై విమర్శల దాడిని మరింత పెంచుతారనడంలో సందేహం లేదు.


