కాకినాడ సెజ్ పై పోరాటానికి సిద్ధమవుతున్న చంద్రబాబు
Published on: Mon Apr 16, 2012 10:51AM
కాకినాడ ప్రత్యేక ఆర్థికమండలి (కె.ఎస్.ఇ.జెడ్.) ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇటీవల కొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఇటీవల సెజ్ ప్రాంతాన్ని సందర్శించి బాధిత రైతులకు సంఘీభావం ప్రకటించారు. వారియా సలహాపై చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20వ తేదీన తూర్పుగోదావరిలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించ బోతున్నారు. ఈ ప్రాంతంలో సెజ్ పేరుతొ చిన్న చిన్న రైతుల నుంచి వందలాది ఎకరాలను సేకరించి పెద్దలకు అప్పనంగా అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కాకినాడ ఎస్.ఇ.జెడ్.లో భాగంగా పొన్నాడ, రమణక్కపేటల్లో 1100 ఎకరాలు, ఏవి నగరం, కోదాడ వద్ద 1500 ఎకరాలు బుచ్చిరెడ్డిపాలెం వద్ద 500 ఎకరాలు, చోడిపల్లిపేట 450 ఎకరాలు సేకరించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం భూముల్లో దాదాపు సగభాగం జి.ఎమ్.ఆర్. గ్రూప్ కు దక్కుతాయి. చిన్నా సన్నకారు రైతులను సెజ్ పేరుతొ భూములను సేకరించి బడా పారిశ్రామిక వేత్తల ధనదాహాన్ని తీరుస్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రజల వ్యతిరేకత కారణంగా కొన్నిచోట్ల భూసేకరణ కష్టంగా మారింది.
ఈ సెజ్ లో ధర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటును కూడా స్థానికులు అడ్డుకుంటున్నారు. అయితే ప్రభుత్వం సెజ్ నిర్వాహకులు కూడా పట్టువదలకుండా భూ సేకరణకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా సేకరించిన సుమారు 2000 ఎకరాల్లో బూమిని చదునుచేసే కార్యక్రమాలు ముగించారు. ధర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పదానికి జి.ఎమ్.ఆర్. సంస్థ ప్రయత్నించింది. అయితే ప్రజలు ఎదుర్కోవడంతో కాకినాడ తీరంలో నీళ్ళపై తేలియాడే బార్జమౌంట్ విద్యుత్ ప్లాంట్ ను నెలకొల్పడానికి జి.ఎమ్.ఆర్. సన్నాహాలు చేస్తోంది. సెజ్ లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
కాకినాడ నుంచి విశాఖకు ఆరు లైన్ల రహదారి ఏర్పాటు చేయబోతున్నారు. అన్నవరం లేదా కత్తిపూడి నుంచి జాతీయ రహదారితో సెజ్ ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నారు. అలాగే రావికంపాడు స్టేషన్ నుంచి రైలు మార్గాన్ని సెజ్ ప్రాంతానికి వేయడానికి ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సెజ్ కోసం ప్రత్యేకంగా ఒక పోర్టును కూడా నిర్మించాలనుకుంటున్నారు. సెజ్ కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్న నిర్వాహకులు రైతుల భూములకు పరిహారం చెల్లించే విషయానికి వచ్చేటప్పటికి సంకుచిత భాగంతో వ్యవహరిస్తున్నారు.


