గోరంట్ల బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. కాకతీయ సేవాసమితి డిమాండ్
Published on: Mon Aug 8, 2022 10:17AM
చేసిన ఛండాలపు పని నుంచి కులం కార్డు అడ్డుపెట్టుకుని బయటపడదామనుకున్న గోరంట్ల మాధవ్ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. అంతే కాదు బూమరాంగ్ అయ్యాయి. గోరంట్ల మాధవ్ కులం కార్డు ఉపయోగించడాన్ని కాకతీయ సేవా సమితి చాలా తీవ్రంగా పరిగణించింది.
గోరంట్ల మాధవ్ ప్రస్తావన తీసుకు వచ్చినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాకతీయ సేవా సమితి డిమాండ్ చేసింది. లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతామని కాకతీయ సేవా సమితి కార్యదర్శి కనకమేడక శ్రీనివాస్ హెచ్చరించారు. చేసినదే ఛండాలపు పని దానికి కులం పేరుతో వెనకేసుకు వస్తామని భావిస్తే అది చాలా పొరపాటని అన్నారు.
తమకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన మాధవ్ కు వ్యతిరేకంగా తమ పోరు రాజకీయాలకు అతీతంగానే ఉంటుందని అన్నారు. కులాన్ని అడ్డుపెట్టకుని రాజకీయ లబ్ధి పొందుదామన్న ప్రయత్నాలను తాము ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కులాన్ని రాజకీయాలకు అపాదించడం తగదని కాకతీయ సేవాసమితి ప్రతినిథి గోపాలకృష్ణ అన్నారు.
గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న తమపై తెలుగుదేశం పార్టీకి వత్తాసుపలుకుతున్నామంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. గతంలో పలు మార్లు తాము తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునూ వ్యతిరేకించిన సందర్బాలను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.


