పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో కడియం శ్రీహరి!!
Published on: Wed Sep 30, 2020 7:42PM
వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సర్కార్ పై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు వీరే ఉన్నారు. గత ఎన్నికల్లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ సులువుగా విజయం సాధించినా ఈసారి ఆ పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కడియం శ్రీహరి అభ్యర్థిత్వంపై పరిశీలన జరుగుతున్నట్లు చర్చ సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలు ఏ నాయకుడిని బరిలోకి దింపినా.. కడియం శ్రీహరి దీటుగా ఎదుర్కోగలరనే నమ్మకంతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉందట.
ఇప్పటికే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై కడియం శ్రీహరితో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించగా.. కడియం శ్రీహరి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కడియం శ్రీహరికి వరంగల్ జిల్లాతోపాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కూడా మంచి పట్టుంది. దానికి తోడు మచ్చలేని నాయకుడిగా ఆయనకున్న పేరు ఎన్నికల్లో కలిసొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోందట. మరి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కడియం.. ఎమ్మెల్సీ ఎన్నికలతో మళ్ళీ యాక్టివ్ అవుతారేమో చూడాలి.


