TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రబెల్లి కూడా కాంగ్రెస్ తలుపు తట్టారా? కడియం వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో ప్రకంపనలు

Published on: Wed Jan 28, 2026 2:40PM

బీఆర్ఎస్ రాజకీయంగా తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నదని వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి అవగతమౌతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ఆ పార్టీ నేతలలోని భయాన్ని, అభద్రతా భావాన్ని ఎత్తి చూపుతోంది. ఈ కేసులో సిట్ ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత హరీష్ రావులను విచారించింది. ఆ వెంటనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సంతోష్ రావును విచారించింది. ఇక తరువాతి వంతు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావే అన్న లీకులు సిట్ నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. 

ఇటువంటి తరుణంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడియం శ్రీహరి గత ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై స్టేషన్ ఘనపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ తరువాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అక్కడితో ఆగకుండా గత పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన అనర్హత వేటు విషయంలో స్పీకర్ విచారణను ఎదుర్కొన వలసి ఉంది. ఇది పక్కన పెడితే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుపై కడియం శ్రీహరి తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎర్రబెల్లి దయాకరరావు కాంగ్రెస్ గూటికి చేరేందుకు విశ్వ ప్రయత్నం చేశారనీ, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ తలుపులు మూసేశారనీ చెప్పారు.

 తాను తెలుగుదేశంలో ఉన్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా కడియం శ్రీహరి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.  తాను తెలుగుదేశంలో ఉన్న కాలంలో ఎర్రబెల్లి తనపై అవాస్తవాలను ప్రచారం చేశారనీ, తప్పుడు ఆరోపణలు చేశారనీ చెప్పారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎర్రబెల్లి కేసీఆర్ కు గంపగుత్తగా అమ్మేశారని ఆరోపించారు.  ఇదంతా చేసి.. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైన తరువాత ఎర్రబెల్లి కాంగ్రెస్ తలుపులు తట్టారని ఆరోపించారు.   కడియం ఆరోపణలకు ఎర్రబెల్లి దయాకరరావు స్పందన ఎలా ఉంటుందన్న విషయంపై ఇప్పుడు రాజకీయవర్గాలలో ఆసక్తి నెలకొని ఉంది.