తెరాసకు కడియం కుటుంబం బిగ్ షాక్.!!

 

తెరాసకు అసంతృప్తుల సెగ తగులుతూనే ఉంది. ఇప్పటికే కొండా సురేఖ, బాబుమోహన్ లాంటి వారు పార్టీని వీడారు. అయితే ఇప్పుడు కడియం కుటుంబం తెరాసకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ కూతురు కావ్య పోటీలో ఉండేలా కార్యకర్తలను గత రెండేళ్లుగా సన్నద్ధం చేశారు. రెండేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా కడియం కావ్య ప్రచారం చేస్తూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. నియోజకవర్గంలో రాజయ్యపై ఉన్న వ్యతిరేకత కూడా కావ్యకు కలిసొస్తుంది.. ఈసారి కావ్యకే టిక్కెట్ వస్తుంది అనుకున్నారంతా. కానీ కేసీఆర్ ఆ అంచనాలను తారుమారు చేస్తూ.. స్టేషన్ ఘన్‌పూర్‌ తెరాస అభ్యర్థిగా మళ్ళీ రాజయ్యనే ప్రకటించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసమ్మతి నేతలంతా బహిరంగసభలు నిర్వహించారు. కేటీఆర్ వద్దకు వెళ్లి తమకు రాజయ్య వద్దని విన్నవించుకున్నారు. అయినా తెరాస అధిష్టానం మాత్రం దిగిరాలేదు. పైగా కడియంను పిలిచి.. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే కాదు.. మహబూబాబాద్, డోర్నకల్ స్థానాలలో కూడా తెరాస అభ్యర్థులకు అసమ్మతి లేకుండా చేసే బాధ్యత మీదే అంటూ కడియంకి నిర్దేశించారట.

 

 

అదే సమయంలో కడియం తెరాసను వీడుతున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. కూతురి టిక్కెట్ కోసం కడియం కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలని కడియం ఖండించారు. ఆయనకు పార్టీ మారే ఉద్దేశం ఉందో లేదో తెలీదు కానీ.. ఆయన కూతురు కావ్య మాత్రం టిక్కెట్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనీ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై ఆమె నియోజకవర్గ కార్యకర్తలతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తెరాసకు బిగ్ షాక్ అనే చెప్పాలి. మహాకూటమి నుండి ఈసారి తెరాసకు నువ్వా నేనా అన్నట్టు పోటీ ఎదురుకానుంది. అంటే తెరాసకు ప్రతి స్థానం ముఖ్యమే. మరి ఇలాంటి సమయంలో కడియం కూతురు కావ్య ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే.. నియోజకవర్గంలో తెరాస ఓటు బ్యాంకు రెండుగా చీలిపోయే ప్రమాదముంది. ఇది మహాకూటమికి కలిసొస్తుంది. గెలుపు వరిస్తుంది. మరి కడియం కావ్య నిజంగానే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి తెరాసకు షాక్ ఇస్తారా? లేక తెరాస కడియం కుటుంబాన్ని బుజ్జగించి స్టేషన్ ఘన్‌పూర్‌లో జెండా ఎగరేస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.