ఉక్కు పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది..!

 

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20 న ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఎంపీ రమేష్ పదకొండవ రోజు దీక్ష విరమించారు.. ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మరియు విపక్షాల తీరుపై మండిపడ్డారు.. ‘ప్రాణం పోయినా పర్వాలేదని ఉక్కు సంకల్పంతో దీక్ష చేపట్టి కొనసాగించిన రమేష్ కు అభినందనలు.. ఆరోగ్యం క్షీణిస్తున్నా ఏడు రోజులు బీటెక్‌ రవి దీక్ష చేశారు.. 

ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు దెబ్బతినే పరిస్థితి వచ్చింది.. పవిత్రమైన భావం, చిత్తశుద్ధితో రమేశ్‌ దీక్ష కొనసాగించారు.. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు సీఎం రమేష్‌ను విమర్శిస్తున్నారని.. ఈ దీక్షలపై ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని బాబు మండిపడ్డారు.. 'విభజన చట్టం ప్రకారం ఆరు నెలల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉంది.. ఏపీకి అన్యాయం చేస్తే వదిలే ప్రసక్తే లేదు.. 5 కోట్ల ఏపీ ప్రజల తరపున డిమాండ్‌ చేస్తున్నా.. రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి.. 

ఉక్కు పరిశ్రమ పెడితే పూర్తిగా మేం సహకరిస్తాం.. ఆర్థిక భారమని మీనమేషాలు లెక్కిస్తే 50శాతం ఖర్చు మీరు పెట్టండి, మరో 50శాతం మేం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని' బాబు అన్నారు.. 'విభజన చట్టంలో ఉన్న హామీలను ఎందుకు నెరవేర్చరని కేంద్రాన్ని అడుగుతున్నా.. మా హక్కులను పోగొట్టుకొనేందుకు సిద్ధంగా లేం.. ఏదేమైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఓ కమిటీ వేస్తాం.. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతాం.. పోరాటం కొనసాగిస్తాం.. పార్లమెంట్‌లో నిలదీస్తాం.. అప్పుడూ కాకపోతే ఈ ఉక్కు పరిశ్రమని  రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రజల రుణం తీర్చుకుంటుంది' అని బాబు అన్నారు.. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి బాటలో సాగుతాం అని చంద్రబాబు స్పష్టం చేసారు.