TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడప జగన్ చేజారిపోయిందా?

Published on: Fri Jul 3, 2026 11:18AM

వైసీపీకి పెట్టని కోటగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోట అయిన  కడప  ఇప్పుడు ఆయన చేజారిపోయిందా?  అంటే ఇటీవలి పరిణామాలను గమనించిన పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం జిల్లాలో..  కేడర్ నుంచి లీడర్ల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. జగన్‌కు తన సొంత జిల్లాపైనే పట్టు సడలినట్లు కనిపిస్తోందన్న భావన రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది. 

అందుకు..   జగన్ కడప జిల్లాలో ఇటీవల జరిపిన మూడు రోజుల పర్యటన నిలువెత్తు నిదర్శనంగా  నిలుస్తోంది.  ఈ పర్యటనలో జగన్.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పార్లమెంటు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. సాధారణంగా పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే.. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీలో పండుగ వాతావరణం నెలకొంటుంది.  కానీ జగన్ తాజా పర్యటనలో అటువంటివేవీ కనిపించలేదు. పైపెచ్చు..  జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు.  కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.  అధినేత పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల వైసీపీ కడప జిల్లా నేతలలో నెలకొన్న నిర్లిప్తతకు, అసంతప్తికి పరిశీలకులు దీనినే కడప జగన్ చేజారిపోయిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు.  

నిజానికి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. జగన్ శ్రద్ధపెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా.. పార్టీకి పెట్టని కోటలాంటి కడప, బలమైన పట్టు ఉన్న నెల్లూరులలోనే వైసీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది.  అయితే పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ కడప జిల్లాలో దయనీయంగా మారడానికి జగన్ స్వయంకృతాపరాథమే కారణమని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో లీడర్లను, క్యాడర్ ను దూరం చేసుకున్నారంటున్నారు.  గతంలో నాయకులను ఇష్టానుసారంగా మార్చడం, స్థానిక సమీకరణాలను పట్టించుకోకుండా, ఎవరికీ ఇష్టం లేకపోయినా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు సీనియర్లను నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుండా నివారించాయనీ, ఇక తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గానికి  ప్రాధాన్యత ఇవ్వలేదని వారిలో అప్పట్లో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పటికీ అలానే ఉందనీ అంటున్నారు.   

మరోవైపు  కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ  క్రమంగా విస్తరిస్తుండగా,   కడపలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలమైన విజయాన్ని దక్కించుకుంది.  ఇంత జరుగుతున్నా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ, కనీసం కేడర్‌కు భరోసా ఇచ్చే  చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పరిస్థితి కడప జిల్లాలో నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందని వైసీపీ నేతలే అంటున్నారు.