TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రసవత్తరంగా మారిన రాయచోటి రాజకీయం

Published on: Tue Jun 5, 2012 1:58PM

కడపజిల్లా రాయచోటీలో త్రిముఖపోటీ నెలకొంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంప్రసాదరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, వైఎస్ ఆర్ సి అభ్యర్థిగా తాజామాజీ గడికోట శ్రీకాంతరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా ప్రజాసంబంధాలున్న అభ్యర్థులు కావటంతో పోటీ గట్టిగా ఉంటుందని పరిశీలకులు అంచనావేస్తున్నారు. వైఎస్ కుటుంబ సన్నిహితుడైన శ్రీకాంతరెడ్డి 2009లో తెలుగుదేశం అభ్యర్థి పాలకొండరాయుడు పై గెలుపొందారు. ఇప్పుడు పాలకొండరాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం తరపున ఈసారి రంగంలో ఉన్నారు. అయితే శ్రీకాంతరెడ్డి 2005లో క్రియాశీలకకార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి యూత్ కాంగెస్ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఈయన జన్మస్థలం రామాపురం మండలంలోని సుద్దమల. మాజీ ఎమ్మెల్యే గండికోట మోహనరెడ్డి వారసునిగా శ్రీకాంతరెడ్డి ఈ ఎన్నికల్లో వై.కా.పా. తరుపున బలమైన ప్రచారాన్ని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుబ్రమణ్యం తన తండ్రి పాలకొండ రాయుడు రాజకీయచతరుత, సోదరుని సహాయంతో రంగంలోకి దిగారు. చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంపై దృష్టి సారించటంతో తన గెలుపు నల్లేరుపై నడక అన్న భావన ఈయన ప్రచారంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈయన తండ్రి రాయడు 30 ఏళ్లుగా టిడిపికి సేవలందించారు. బాలసుబ్రహ్మణ్యం జెడ్ పిటిసిగాను, జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ గాను పనిచేశారు. బలిజకులస్తుల ఓటు బ్యాంకు 15వేలు, యాదవ,వడ్డెర, దూదేకుల, క్షత్రియ, వైశ్య ఓట్లు ఈయనకు అనుకూలమని అంచనా వేస్తున్నారు.

 

 

 

పాలకొండరాయుడుకు కమ్మ, మాదిగ సామాజికవర్గాల్లో అభిమానులున్నారు. సుబ్రహ్మణ్యం సోదరుడు ప్రసాద్ కూ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. చివరిగా కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఈయన తండ్రి నాగిరెడ్డికి రాజకీయ వారసునిగా తెరపైకి వచ్చారు. 2004లో కాంగ్రెస్ టిక్కెట్టు కోసం విఫలయత్నం చేసిన రాంప్రసాద్ రెడ్డి కుటుంబానికి సిఎం కిరణ్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. కిరణ్ తండ్రి అమరనాథ్ రెడ్డికి, నాగిరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. పాకనాటి వర్గానికి చెందిన రాంప్రసాద్ రెడ్డి రామాపురం, కంచేపల్లి. చిన్నమండెం గ్రామాల్లో బంధువులున్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కూడా రాంప్రసాదరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. ఇక్కడ మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ కు మళ్లించేందుకు మంత్రి ఆహ్మతుల్లా పర్యటిస్తున్నారు. ప్రచారంలోనూ, బలంలోనూ పోటాపోటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపెవరిని వరిస్తుందో అన్నది మాత్రం తెరపై చూడాలి.