ఐతే కాంగ్రెస్ లేకపోతే టిడిపి గోడ మీద పిల్లిలా మారిన పసుపులేటి
Published on: Fri Mar 16, 2012 4:24PM
కడప జిల్లా రాజంపేటకు చెందిన పసుపులేటి బ్రహ్మయ్య గోడమీద పిల్లిగా మారిపోయాడన్న అపవాదును మూటగట్టుకుంటున్నాడు. ఆయన కాంగ్రెస్, టిడిపిల వైపు ఆశగా చూస్తున్నారు. రాజంపేట ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదాని తరపున పోటీచేయాలని ఆయన రెండు పార్టీల నేతల చుట్టూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు. రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పసుపులేటి బ్రహ్మయ్య రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టిక్కెట్ ఆశించారు. అయితే ఆ పార్టీ మొండిచేయి చూపించడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇక్కడ కూడా ఆయనకు టిక్కెట్ లభించలేదు. దీంతో ఆయన కొంతకాలంగా రాజకీయాలకు అతీతంగా ఉంటున్నారు. ఇప్పుడు రాజంపేట ఉప ఎన్నికలు జరగబోతుండటంతో కాంగ్రెస్ లేదా టిడిపిల్లో ఏదో ఒక పార్టీ తరపున టిక్కెట్ దక్కించుకోవాలన్న ఉద్దేశంతో చాపక్రింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం టిక్కెట్ బ్రహ్మయ్యకు ఖరారైతే కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండిపడుతుంది. బ్రహ్మయ్యతో పాటు పిఆర్పీలో నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. వీరంతా భ్రహ్మయ్యవైపు మొగ్గుచూసే అవకాశముంది. దీనికి తోడు బ్రహ్మయ్య సామాజికవర్గానికి చెందినవారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వలస వచ్చే అవకాశముంది.


