చిరంజీవికి మంత్రిపదవి ఇవ్వాలి:కడప కాంగ్రెస్
Published on: Sat Jan 14, 2012 9:18PM
కడప:రాష్ట్ర మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని తీసుకోవాలని కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రంలో పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల తిరుపతి స్థానానికి రాజీనామా చేయించాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే.. తిరిగి ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి గెలుపొందే అవకాశాలు ఏమాత్రం లేవని వారు చెపుతున్నారు. అందువల్ల సీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా, ఆయన స్థానంలో చిరంజీవికి ఇవ్వాలని వారు కోరుతున్నారు.ఒకవేళ... చిరంజీవి వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకొనే దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే దాన్ని విరమించుకోవాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు వారు సూచన కూడా చేసినట్టు సమాచారం. సీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే కడప జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి పెచ్చురిల్లుతుందన్నది వారి ఆందోళనగా ఉంది.


