TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడప...అక్రమార్కుల గడప

Published on: Fri Feb 24, 2012 2:36PM

కడప:  కడప జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. చీకటి సామ్రాజ్యాలకు ఏర్పాటు చేసుకునే వ్యక్తులకు ఖద్దరు నేతల ఆశీస్సులు, ఖాకీల మద్దతు లభిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వైజాగ్ హార్బర్ లో ఉన్న హోటల్లో పనిచేసేవాడు. కొన్నేళ్ళ క్రితం కడప వచ్చాడు. వచ్చింది మొదలు ఎర్రచందనం అక్రమ రవాణా, దొంగనోట్ల చెలామణి, కొకైన్ కొనుగోలు, సరఫరా కార్యక్రమాలను విచ్చల విడిగా కొనసాగించాడు. విలాసవంతమైన భవనాలు, ఖరీదైన వాహనాలు, మందీమార్బలంతో తిరిగే ఈ కొకైన్ వీరుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. పోలీసులు కూడా ఇతనిచ్చే కాసులకోసం ఎదురు చూస్తూ ఉంటారు.
 

 

 ఆయిల్ సైడింగ్ దందాలో లేడీ డాన్ గా చలామణి అవుతున్న ఒక మహిళ తన కుటుంబం సభ్యులతోపాటు ఐఓసిలోని కొంతమంది ఉద్యోగుల సహకారంతో యదేచ్ఛగా ఆయిల్ ను కొల్లగొట్టేస్తుంది. పెద్దల అండతో ఈమె పెట్రెగిపోతుంది. ఆయిల్ కొల్లగొట్టడం ద్వారా ఇప్పటికే ఆమె కోట్లాది రూపాయలు సంపాదించింది.
 

 

 పురాతన దేవతా మూర్తుల విగ్రహాల వేటలో ముంబైకి చెందిన ఒక శేఠ్ కడపజిల్లాలో తిష్టవేశాడు. ఖరీదైన ఇరిడియం కాపర్ విగ్రహాల వేటలో అతను నిమగ్నమయ్యాడు. వీటి కొనుగోలు, విక్రయాల్లో అతను స్థానికి ఖద్దరు,ఖాకీలకు వాటాలు ఇస్తున్నాడు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని ఇటీవల కొందరు విలేఖరులు ప్రశ్నిస్తే తమకు అతని సమాచారం ఉందని అంగీకరించారు. అయితే అతనిపై చర్య తీసుకోవడానికి మాత్రం సాహసించడం లేదు.

 

 ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నగరంలోని ఒక వ్యక్తితో చింతకొమ్మదిన్నెకు చెందిన ఒక యువకుడు జత కలిశాడు. ఇరివురు కలిసి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పోలీసులు తమ జోలికి రాకుండా వారికి అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ ఆనతికాలంలోనే అంచలంచలుగా కోట్లకు పగడలెత్తారు. ఈ చీకటి సామ్రాజ్య అధిపతుల కార్యకలాపాలతో కడప జిల్లాప్రతిష్ట మరింత దిగజారింది.