కడపలో రూ.కోట్ల విలువైన భూమి కబ్జా
Published on: Tue Feb 14, 2012 1:51PM
క
డప: ఒకనాటి మహానేత, నేటి యువనేత ముఖ్యఅనుచరులు కడప పట్టణ శివార్లలో సుమారు 200 కోట్ల రూపాయల విలువైన వంక భూమిని దర్జాగా కబ్జాచేశారు. కడప పట్టణానికి ఆనుకొని ఉన్న బుడ్డాయిపల్లె వంకభూమి ఈ ఆక్రమణలకు వేదికైంది. అక్కడ దాదాపు 600 ఎకరాలు వుండగా దానిలో ఇప్పటికే 300 ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురైంది. ఈ భూమిలో చిన్న చిన్న పరిశ్రమలతో పాటు పోష్ గా నిర్మించిన భవంతులు కూడా ఉన్నాయి. ఎపిఐఐసి భూమిని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో ఎకరం దాదాపు కోటి రూపాయల వరకు పలుకుతోంది. ఇంత విలువైన భూమిని గత ఐదేళ్ళుగా పలుకుబడిగల వ్యక్తులు కబ్జా చేసినప్పటికీ అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోయింది. మహానేత, యువనేత అనుచరగణం,వారి బంధుమిత్రులు, వారి అడుగులకు మడుగులొత్తే అధికారులు కూడా ఈ కబ్జాకు పాల్పడినట్లు తెలిసింది. బుడ్డాయిపల్లె వంకభూమితో పాటు ఎపిఐఐసికి చెందిన భూమిపై కూడా ఇటీవల ఈ కబ్జాదారులు కన్నేసి కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఎపిఐఐసి సంస్థకు ఇక్కడ 400 ఎకరాల భూమి ఉండగా దానిలో దాదాపు 50 ఎకరాల భూమి కబ్జాకుగురైంది.


