కేటీఆర్ కు కేఏ పాల్ వార్నింగ్.. గొడవలొద్దు
Published on: Tue May 7, 2019 5:46PM

తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 23 కుటుంబాలు ఏడుస్తున్నాయని.. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. తానేం మందా కృష్ణమాదిగను కానని.. 2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని పాల్ చెప్పుకొచ్చారు. మెదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
"కేటీఆర్‌కు డబ్బు, అహంకారం ఎక్కువైంది. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా?. కేటీఆర్ చినజీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్‌ను పూజారులు కూడా కాపాడలేరు. నేను శాపం పెడితే నాశనం అయిపోతారు. గొడవలొద్దు. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో నాతో కలసిరావాలి. అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దాం. నాకు ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్‌ను హైదరాబాద్ తీసుకొస్తాను. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్‌లో చేరుతున్నారు" అని కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


