ఆ అభ్యర్థులు మా పార్టీ వారు కాదు.. ఎన్నికలు ఆపాలి

 

ఏపీలో ప్రజాశాంతి పార్టీ తరపున పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చాలా చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన వారు నామినేషన్ వేశారు. అయితే ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ వేసి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ బాంబు పేల్చారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ, వైసీపీకి చెందిన వారు తమ సిబ్బందిపై దాడిచేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి అభ్యర్థులను నిలిపారన్నారు. టీడీపీ 38 మంది, వైసీపీ 11 మంది అభ్యర్థులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్థుల బీఫారాలు తిరస్కరించిన అధికారులు టీడీపీ, వైసీపీ వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానన్నారు. ఇంకా ముందు ముందు కేఏ పాల్ ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో చూడాలి.