TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ ది నోరా? మోరీనా?.. అప్పుడు చెప్పింది గుర్తులేదా!!

Published on: Wed Oct 9, 2019 4:41PM

 

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ.. భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

నాడు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని చంద్రకుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేసీఆర్ ది నోరా? మోరీనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవ్లరకు నెలకు 50 వేల రూపాయల జీతం ఇస్తున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ డ్రైవర్ కు, కండక్టర్ కు అంత మొత్తం ఇస్తున్నారో చూపించాలని చంద్రకుమార్ డిమాండ్ చేశారు.

టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది కనుక ప్రైవేట్ పరం చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా అని చంద్రకుమార్ ప్రశ్నించారు. యూనియన్లు అవసరం లేదనడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు. ఎన్నికలు, సకలజనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఓసారి గుర్తుకుతెచ్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని, వారి జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సమానం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆరోజున మాట్లాడిన మాటేంటి? ఈరోజున మాట్లాడుతున్న మాటేంటి? అని చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.