రావాలి.. రావాలి.. జూ.ఎన్టీఆర్ రావాలి..! మరి, వస్తాడా?

జై బాబు. జై జై బాబు. కుప్పంలో చంద్రబాబు రోడ్ షో సూపర్ హిట్. సీబీఎన్ టూర్ కంటే ఆ రోడ్ షోలో జరిగిన ఓ అనూహ్య ఘటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. టీడీపీలో విస్త్రుత చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలంటూ చంద్రబాబు రోడ్ షో లో నినాదాలు మారుమోగాయి. రావాలి.. రావాలి.. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలి.. టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు సమక్షంలో బహిరంగంగా డిమాండ్ చేశారు. జై చంద్రబాబు.. జై జూనియర్ ఎన్టీఆర్ నినాదాలతో కుప్పం రోడ్ షో లో హోరెత్తించారు. ఎన్టీఆర్ ఫోటోలతో కుప్పంలో ఫ్లెక్సీలు వెలిశాయి.

జూనియర్ ఎన్టీఆర్. సినిమా హీరోగా ఫుల్ క్రేజ్. నందమూరి వారసుడిగా ఇటు నటన, అటు రాజకీయం ఆయన రక్తంలోనే ఉంది. పెద్ద ఎన్టీఆర్ పోలికలు, అనర్గళ వాగ్ధాటి జూనియర్ కు జన్మతా వచ్చిన లక్షణాలు. నందమూరి ఫ్యామిలీలో బాలయ్య తర్వాత తారక్ లోనే ఆ చరిష్మా. ఆ ఆకర్షణ. తాత పెట్టిన పార్టీ కోసం గతంలో టీడీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు జూనియర్. అచ్చం పెద్ద ఎన్టీఆర్ మాదిరే ఖాకీ డ్రెస్ ధరించి.. చైతన్యరథంపై పర్యటించి అదరగొట్టారు. తెలుగు తమ్ముళ్లలో ఉత్తేజం, ఉత్సాహం నింపారు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చినంత ప్రాభవం.. ఆనాటి ఎన్నికల ఫలితాల్లో మాత్రం కనిపించలేదు. 2009లో వైఎస్సార్ ప్రభంజనానికి ఎదురొడ్డి.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో జూనియర్ విఫలమయ్యాడు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు గెలవలేకపోయారు. దీంతో. వ్యక్తిగత ఇమేజ్ వేరు.. రాజకీయాలు వేరనే తర్కం బుడ్డోడికి బోధపడింది. ఆ తర్వాత కుటుంబంలో, పార్టీలో వచ్చిన పరిణామాలు.. జూనియర్ ను పసుపు జెండా నుంచి దూరం పెట్టాయి. లోకేశ్ ఎంట్రీతో ఎన్టీఆర్ అవసరం తగ్గిపోయింది. పార్టీని లోకేశ్ సమర్ధవంతంగా నడుపుతుండటంతో టీడీపీలో జూనియర్ కు స్పేస్ లేకుండా పోయింది. 

రాజకీయాలు తనకిప్పుడు సెట్ కావని భావించిన జూనియర్.. అప్పటి నుంచీ సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. అనేక సూపర్ హిట్లు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మూవీ గ్రాఫ్ పీక్స్ మీదుంది. టాలీవుడ్ లో టాప్ హీరోగా లైమ్ లైట్లో ఉన్న జూనియర్ ను సడెన్ గా రాజకీయాల్లోకి రావాలంటూ కుప్పం ప్రజలు డిమాండ్ చేయడం అనూహ్యం. అందుకే, జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది. 

జగన్ దూకుడుతో టీడీపీ ఇబ్బంది పడుతోంది. వరుస దాడులు, కేసులతో కేడర్ డీలా పడుతోంది. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీలో జోష్ పెరుగుతుందని కుప్పం ప్రజలు భావించి ఉండొచ్చు. అయితే.. గ్రహణం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మబ్బులు వీడాక మళ్లీ చంద్రోదయం ఖాయం. తాత్కాలిక కష్ట, నష్టాలను తట్టుకుని నిలబడటమే రాజకీయాల్లో ఉన్న వారికి అవశ్యకం. జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయనకు కావలసినంత వయసు, మంచి భవిష్యత్తు ఉంది. ఒకసారి చేదు అనుభవం ఎదురై.. రాటు దేలిన ఎన్టీఆర్.. ఇప్పటికిప్పుడే పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా లేరు. ఎన్టీఆర్ సినీ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. పాలిటిక్స్ వద్దంటూ ట్విట్టర్ లో జూనియర్ ఫ్యాన్స్ ట్వీట్లతో ఊదరగొడుతున్నారు. సినీ ఫ్యాన్స్ రాజకీయాలు వద్దంటుంటే.. పొలిటికల్ ఫ్యాన్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ డిమాండ్ చేస్తుండటం ఆసక్తికరం. మరి, ఆ మనువడి మదిలో ఏముందో..?