జూ ఎన్టీఆర్ పార్టీకి దూరం కాలేదు రమణ
Published on: Mon Jan 23, 2012 1:10PM
హైదరా
బాద్: నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ సేవలు పార్టీకి ఎంతో అవసరమని, ఎన్టీఆర్ పార్టీకి దూరం కాలేదని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ శాసనసభ్యుడు ఎల్ రమణ సోమవారం అన్నారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారన్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి బాలయ్య, హరికృష్ణ పార్టీ పురోభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అండగా ఉంటారని తెలిపారు. హీరో నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుండి ఐనా పోటీకి సిద్ధంగా ఉన్నారని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విధానాల కోసం బాలయ్య అరంగేట్రం చేశారన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో పర్యటిస్తున్న బాలకృష్ణను తాము తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. బాలయ్య రాకతో పార్టీలో, ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. బాలయ్య ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.
కాగా, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం తాము సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం భేటీ అయింది. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం చేపట్టనున్న పాదయాత్రపై వారు చర్చించనున్నారు.


