TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీవ్రరూపం దాల్చిన జూడాల సమ్మె..ఆస్పత్రుల్లో మరణమృదంగం

Published on: Sat Feb 11, 2012 1:18PM

హైదరాబాద్‌ : జూడాల దీక్ష రోగుల పాలిట శాపంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం దిగి రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా తమ సమ్మెను ఉధృతం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచే అత్యవసర సేవలను నిలిపేశారు. దీంతో వైద్యం అందక రాష్ట్రంలో 9 మంది ప్రాణాలు విడిచినట్లు సమాచారం. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. కర్నూలు ఆస్పత్రిలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు చెబుతున్నారు. అలాగే, విశాఖపట్నంలో ఒకరు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరివి సహజ మరణాలేనని ప్రభుత్వ అధికారులు చెబుతుండగా, జూడాల సమ్మె కారణంగా అత్యవసర సేవలు నిలిచిపోయి తమ వారు మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4వేల మంది జూడాలు సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వ వైఖరిపై వారు మండిపడుతున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రోగులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. స్టయిఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం కూడా జూడాలను చర్చలకు పిలిచింది. అయితే, ప్రభుత్వం దిగి రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. వైద్య విద్య శాఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిఎల్ రవీంద్రా రెడ్డి నుంచి తప్పించి కొత్త మంత్రి కొండ్రు మురళికి అప్పగించైనా విషయం విదితమే. వైద్య శాఖామంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ... జూనియర్ డాక్టర్లు విద్యార్థులు మాత్రమేనని గుర్తించుకోవాలని అన్నారు. తాము సీనియర్ డాక్టర్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ డాక్టర్లు పట్టుదలకు పోవడం మంచిది కాదని, వారు కూడా ప్రభుత్వంలో భాగమే కనుక సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.


కాగా, జూనియర్ డాక్టర్ల సమ్మెకు మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. గాంధీ ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సంఘీభావం తెలిపేందుకు ఐద్వా నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఎమర్జెన్సీ వార్డు వైపు వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సహచరుల అరెస్ట్తో మిగిలిన కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.