TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మునుగోడు.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు..!

Published on: Wed Sep 7, 2022 3:53PM

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్. ఏ ఇద్దరు కలిసినా మునుగోడు ఉప ఎన్నిక గురించిన చర్చే జరుగుతోంది. ఆ చర్చలకు తగ్గట్టే అక్కడి రాజకీయాలు రంగులు మారుతున్నాయి.  మూడు ప్రధాన పార్టీలు.. కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీ.. ఇక్కడ గెలుపే లక్ష్యంగా వలస రాజకీయాలను భారీగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలూ పావులు కదుపుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా.. స్థానిక నాయకులు కూడా అటు నుంచి ఇటూ ఇటు నుంచి అటూ పార్టీలు మారుతూ.. తమ తమ డిమాండ్లను నెరవేర్చుకుంటున్నారు.

తాజాగా.. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. చండూరు మండలం దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్.. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో.. ఆయనపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్.. దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరేలా పావులు కదిపింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో దేవేందర్ మళ్లీ కారెక్కారు.  

వలస రాజకీయాలను ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ లు సైతం ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. టీఆర్ఎస్  పార్టీలో ఆసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి.. తమ తమ పార్టీల్లోకి ఆహ్వానించే ప్రయత్నాలు బీజేపీ, కాంగ్రెస్ లు ముమ్మరంగా చేస్తున్నారు. కాంగ్రెస్ మాట ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ ను  వేగం చేసింది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీలో చేరికలను పెంచుతున్నారు.  గతంలో ఉన్న పరిచయాలతో.. సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల వరకు.. అందర్నీ బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.