TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూబ్లీ ఉప ఎన్నిక.. కొండవీటి చాంతాడు చిన్నబోయేలా ఆశావహుల సంఖ్య

Published on: Sat Oct 4, 2025 12:12PM

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది.  అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ ఆ ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.  ఫలితంగా రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. చివరకు అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత ఆసంతృప్తి భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.  కాంగ్రెస్ పకడ్బందీగా, ప్రణాళికా బద్ధంగా జూబ్లీ ఉప ఎన్నిక రేసులోంచి మాజీ ఎంపీ అజారుద్దీన్ ను తప్పించిందని చెప్పుకున్నంత సేపు పట్ట లేదు.. మరింత మంది పోటీలోకి వచ్చేసి పార్టీకి తలనొప్పులు తీసుకురావడానికి. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలిచి, ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ నుంచి పలువురు నేతలు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీకి సై అంటున్నారు. అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడే చిన్నబోతుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు అలకపాన్పు ఎక్కి అసమ్మతి జ్వాలలు ఎగిసిపడతాయన్న ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది. దీంతో  మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది. ఆశావహుల మధ్య సయోధ్య కుదిర్చి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన అజెండాతో ఆమె హస్తిన నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఆమె ప్రయత్నాలు ఎంత వరకూ, ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.  
జూబ్లీ ఉప ఎన్నిక తో పాటు స్థానిక ఎన్నికలలో కూడా పార్టీని విజయతీరాలకు చేర్చాలన్న వ్యూహంతో ఆమె పథక రచన చేయనున్నారు. ఇందు కోసం ఆమె వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా జూబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై ఆమె దృష్టి సారిస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పార్టీ సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.   ఆమె జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయాన్ని తీసుకురాగలుగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.