TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూబ్లీ బైపోల్ కౌంటింగ్ రేపు.. ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

Published on: Thu Nov 13, 2025 8:59AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబర్ 14)న వెలువడనున్నాయి. పోలింగ్ ఈ నెల 11న అంటే మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తధ్యం అని అంచనా వేసినా, తుది ఫలితం కోసం పార్టీలూ, అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతోంది.  

ఈ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర బలగాల మూడంచెల భద్రత నడుమ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రంగా ఉంచారు. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది.  ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.  ఇక కౌంటిగ్ కోసం  42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే  కౌంటింగ్ పూర్తి అవుతుంది.  ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్‌లో పాల్గొంటారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు.  ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాకపోవడంతో.. ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది. 

హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా, 101 మంది ఓటు వేశారు. ఈవీఎంలో ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 99,771 మంది పురుషులు, 94,855 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  ఇక మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.