తెదేపా నేతలపై జూ. యన్టీఆర్ పంచ్ డైలాగులు

Publish Date:May 21, 2013

 

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన నటిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ నిన్న విడుదల చేసారు. ఆ టిజర్ లో ఎన్టీఆర్ ఒక పంచ్ డైలాగు పేల్చారు. ''ఎవడు పడితే వాడు బుడ్డోడు, బుడ్డోడు అని అంటే గుడ్డలూడతీసి కొడత..అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయ్యుండాలి.''

 

ఇది సినిమాకు సంబంధించిన డైలాగయినప్పటికీ, అది తెదేపాలో తనను విమర్శిస్తున్న కొందరు నేతలను ఉద్దేశించి అన్నవేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ ఫ్లెక్సీ బ్యానర్ యుద్ధంలో బలయిన తనను, తన తండ్రి హరికృష్ణను చంద్రబాబు ప్రోద్బలంతో బాలకృష్ణతో సహా కొందరు తెదేపా నేతలు తీవ్రంగా విమర్శించడం, సంజాయిషీలు కోరడంపై ఆగ్రహించిన జూ.యన్టీఆర్, ఈ డైలాగుతో వారిని హెచ్చరించినట్లు అర్ధం అవుతోంది.

 

కానీ, ఇటువంటి డైలాగులు దియేటర్లో ప్రేక్షకుల చేత చప్పట్లు చరిపించుకోవడానికే తప్ప వేరేవిధంగా ఉపయోగపడవని ఆయనకు తెలిసే ఉండాలి. పార్టీలో తనను వ్యతిరేఖిస్తున్న వారిని, విమర్శించేవారిని ఎదుర్కొని గట్టిగా సమాధానం చెప్పదలచుకొంటే, ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావలసి ఉంటుంది. అయితే, తనకు ప్రస్తుతం అటువంటి ఆలోచనలు లేవని జూ.యన్టీఆర్ స్వయంగా చెప్పారు గనుక, అంతవరకు ఇటువంటి పంచ్ డైలాగులతోనే తన కోపం చల్లార్చుకోక తప్పదు మరి.