సాక్ష్యాలతో దొరికిన ఆమంచి.. సొంత పార్టీ వ్యక్తి పైనే దాడి!!

 

చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల నాగార్జున రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన వ్యక్తులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులని వార్తలొచ్చాయి. అంతేకాదు అసలు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి.. ఆమంచి మరియు అతని అనుచరుల అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జున రెడ్డి కూడా తనపై.. ఆమంచి బంధువులు, అనుచరులు దాడి చేశారని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆమంచి మాత్రం ఇదంతా పచ్చి అబద్దం, ఇది టీడీపీ ఆడిస్తున్న నాటకం అని కొట్టి పారేసారు. అంతేకాదు.. 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదు. ఇటీవల ఎన్నికలలో టీడీపీ ఏజంట్‌ గా పనిచేసాడు. టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.' అని ఆమంచి చెప్పుకొచ్చారు.

 

అయితే ఆమంచి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అబద్దమని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఆధారాలు దర్శనమిస్తున్నాయి. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదని ఆమంచి అన్నారు. కానీ ఆమంచి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, అదే పార్టీ అధినేతకు చెందిన మీడియా సంస్థలో నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ గా పనిచేసారు.

 

 

అదేవిధంగా నాగార్జున రెడ్డి.. ఎన్నికలలో ఏజంట్‌ గా పనిచేసిన మాట వాస్తవమే కానీ.. ఆయన పనిచేసింది టీడీపీ కోసం కాదు ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నాగార్జున రెడ్డి టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆమంచి చెప్పుకొచ్చారు. కానీ నిజానికి నాగార్జున రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంతెందుకు వైఎస్ జగన్ తో కలిసి పాదయాత్రలో కూడా పాల్గొన్నారు.

 

 

మరి ఇవన్నీ తెలియకుండానే 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదు, టీడీపీకి చెందిన వ్యక్తి' అని ఆమంచి వ్యాఖ్యలు చేసారా?. ఏది ఏమైనా ఆధారాలతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమంచిని ఏకేస్తున్నారు.

అంతేకాదు ఆమంచి కుటుంబం మీద ఉన్న కేసుల లిస్ట్ ని కూడా ప్రస్తావిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమంచి తండ్రి మీద.. హత్య, దొంగసారా మరియు హత్యాయత్నం కింద పలు కేసులు నమోదయ్యాయి.

ఆమంచి సోదరుడిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి వర్గీయలు చీరాలలో పలువురిపై దాడి చేసిన ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై గతంలో కూడా ఆమంచి సోదరుడు, అనుచరులు దాడి చేసాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆమంచి వర్గీయులే తన మీద దాడి చేసారని నాగార్జున చెప్తున్నాడు. కానీ ఆమంచి మాత్రం సింపుల్ గా.. అతను జర్నలిస్ట్ కాదు, టీడీపీ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ వ్యక్తి అయితే జగన్ తో పాదయాత్రలో ఎందుకు పాల్గొన్నాడు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన వ్యక్తే ఆమంచి మరియు అతని వర్గీయులపై ఫిర్యాదు చేస్తున్నారు అంటే.. చీరాలలో వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు అంటున్నారు. ఆమంచి మరియు అతని వర్గీయులు చీరాలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.