వివేకానంద రెడ్డి హత్య వెనుక లోతైన కుట్ర... కేరళ హక్కుల కార్యకర్త సంచలనం..!

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డి హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని.. దీని వెనుక కొందరి హస్తం గురించి తనకు కచ్చితమైన అనుమానాలున్నాయని కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్‌ పుతెన్‌ పురక్కల్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక లోతైన కుట్ర ఉందని.. అయితే అనుమానితుల గురించి ఇపుడే మాట్లాడడం సరి కాదని.. దీనిపై రెండు నెలల్లో విలేకరుల సమావేశం నిర్వహించి, మొత్తం సాక్ష్యాధారాలు బయటపెడతామని అయన ప్రకటించారు.

 

నిన్న ఢిల్లీలో ఒక తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. ఆయన వివేకానందరెడ్డి హత్య గురించి పలు విషయాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం తనను వివేకా కుమార్తె సునీతారెడ్డి కలిశారని.. ఈ విషయంపై తాము సుదీర్ఘంగా చర్చించామని అయన తెలిపారు. సీబీఐ దర్యాప్తు విషయంలో..  సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయంపై తాము చర్చించామని అయన తెలిపారు. వివేకా హత్య కేసులో హంతకులకు తప్పకుండా శిక్షపడేలా చేస్తామన్నారు.

 

కేరళలో పెను సంచలనం రేపిన సిస్టర్‌ అభయ కేసు విషయంలో పోలీసులు ప్రజలను తప్పుదోవ పట్టించి.. ఆమెది ఆత్మహత్యగా చెప్పి కేసును మూసేయించారని.. దీని వెనుక అక్కడి చర్చి కీలక పాత్ర పోషించిందని జోమున్‌ తెలిపారు. అయితే అప్పట్లో దీనిపై ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, సాక్ష్యాధారాలు సేకరించేలా చేశానన్నారు. తన సోదరుడితోనే తనను హత్య చేయించేందుకు చర్చి ఫాదర్‌ ప్రయత్నిస్తే..తాను గాయాలతో బయటపడ్డానని అయన చెప్పారు. చివరకు చర్చి ఫాదర్‌, నన్‌ కలిసి సిస్టర్‌ అభయను చంపారన్న విషయాన్ని సీబీఐ కోర్టు నిర్ధారించి నిందితులకు శిక్ష విధించిందని జోమున్ పురక్కల్ తెలిపారు.