కేసీఆర్ సర్కారుకు పుట్టగతులు ఉండవు
Published on: Mon Jul 30, 2018 2:41PM
వేడుక చేసి మరీ విమర్శల పాలు కావడమంటే ఇదేనేమో.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటినుండి కేసీఆర్ తెలంగాణ పండుగలకు, ఆచారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.. బతుకమ్మ, బోనాలు మునుపెన్నడూ జరగని విధంగా వైభవంగా చేస్తున్నారు.. అయినా కేసీఆర్ కు విమర్శలు తప్పట్లేదు.. దానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, అలానే ప్రచారంలో ఉన్న భారీతనం ఏర్పాట్లలో లేకపోవడం.. ఈ కారణాల వల్లే జోగిని శ్యామల సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు, కేసీఆర్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.

మహంకాళి బోనాల సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.. అంగరంగ వైభవంగా బోనాలు అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసారు.. దీంతో అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు.. కానీ అధికారులు చేసిన ఏర్పాట్లు మాత్రం కేసీఆర్ ని విమర్శలు పాలు చేసాయి.. వీఐపీలు వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాట వల్ల మహిళలు ఇబ్బంది పడ్డారు, కొందరు మహిళలు కంటతడి పెట్టారు, మరికొందరు తమకు ఎదురైన చేదు అనుభవంతో అమ్మవారిని దర్శించుకోకుండా వెనుదిరిగారు.. దీంతో ఆవేదన చెందిన శ్యామల ప్రభుత్వంపై మండిపడ్డారు.. 'మహిళలు ఒక్కొక్కరూ దాదాపు 10 కేజీల బరువు బోనంతో లైన్లో నిలుచున్నారు.. అవేమీ పట్టించుకోకుండా వీఐపీలు వస్తున్నారంటూ గంటల తరబడి భక్తుల క్యూలైన్లు ఆపేసారు.. బంగారు తెలంగాణ అంటే ఇదేనా?' అంటూ ప్రశ్నించిన శ్యామల.. మహిళలు కంటతడి పెట్టేలా చేసిన కేసీఆర్ సర్కారుకు పుట్టగతులు ఉండవని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే అవకాశమే లేదని మండిపడ్డారు.


