మోడీ భజన ఎందుకో తెలుసులే! జగన్ కు జేఎంఎం కౌంటర్

కొవిడ్ కట్టడి అంశంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదం మరింత ముదురుతోంది. ప్ర‌ధాని మోడీకి స‌పోర్ట్ చేస్తూ.. స్వ‌యంగా మ‌రో రాష్ట్ర సీఎంకు కౌంట‌ర్ ఇస్తూ.. జగన్ ట్వీట్ చేయ‌డం జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. తమ నేతను కౌంటరిస్తూ జగన్ చేసిన ట్వీట్ కు హేమంత్ సోరేన్ పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఘాటుగానే స్పందించింది. మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసంటూ జగన్‌కు చురకలంటించింది. అంతేకాదు  మేము కూడా నిన్ను అభిమానించి, గౌరవిస్తున్నామని, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. 

ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో శనివారం ట్వీట్ చేసింది. ‘‘మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసు వైఎస్ జగన్.. అవును, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం.. గౌరవిస్తాం.. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. ట్వీట్‌కు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన న్యూస్‌ను ట్యాగ్ చేసింది జేఎంఎం. 

శుక్రవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ కొవిడ్ పై మాట్లాడారు. ప్రధాని ఫోన్‌ సంభాషణ తర్వాత హేమంత్‌ సోరెన్‌ ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్‌ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట మాత్రమే చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అని ట్వీట్‌ చేశారు. హేమంత్‌ ట్వీట్‌ను ఆక్షేపిస్తూ ఏపీ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రధానిపై ఝార్ఖండ్ సీఎం సోరేన్ చేసిన విమర్శలను ఖండించారు. సోరేన్ వ్యాఖ్యలపై దేశంలో మరే ఏ ముఖ్యమంత్రి ఖండించలేదు. బీజేపీ ముఖ్యమంత్రులు, నేతలు కూడా కౌంటర్ ఇవ్వలేదు. ఏపీ సీఎం జగన్ మాత్రమే స్పందించారు.  

ప్రధాని మోడీకి.. జగన్ మద్దతు తెలపడంతో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. గతంలో ఆయన జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు జగన్. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీపీఐ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ కూడా మొదలైంది. దీంతో ఏ క్షణాన్నైనా బెయిల్ రద్దై జగన్ తిరిగి జైలుకు వెళ్లక తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మద్దతు ఉంటేనే జగన్ కు రాజకీయ మనుగడ సాధ్యం. అందుకే మోడీకి మోకరిల్లుతూ అడక్కుండానే జగన్ ట్విట్టర్ లో మద్దతు ఇచ్చి కేంద్రాన్ని మచ్చిక చేసుకుంటున్నారనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే జగన్.. అడగకపోయినా, బీజేపీ నేతల కంటే స్పీడుగా, దూకుడుగా ప్రధాని మోడీకి అండగా నిలిచారని అంటున్నారు.

దేశంలో క‌రోనా క‌ల్లోలానికి కారణమంటూ అంత‌ర్జాతీయ మీడియా మోడీని టార్గెట్ చేసింది. నిపుణులు హెచ్చ‌రిస్తున్నా.. సెకండ్ వేవ్‌పై చేతులెత్తేశారంటూ  ఏకిపారేస్తోంది. వ్యాక్సిన్ కొర‌త‌కు, ఆక్సిజ‌న్ లోటుకు ఆయ‌న చేత‌గాని త‌న‌మే కార‌ణ‌మంటూ కథనాలు వస్తున్నాయి. జన‌మంతా క‌రోనా దోషిగా న‌రేంద్ర మోడీపై దుమ్మెత్తిపోస్తుంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఆయ‌న్ను ఏమీ అనొద్దంటూ వెన‌కేసుకు వ‌చ్చారు. దీంతో జగన్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా చరకలంటిస్తున్నారు. కరోనా ఇంత విపత్తు సమయంలోనూ ఎందుకీ మోడీ భజన అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్సీపీ అభిమానులు కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రాన్ని మీరు నిలదీయకుండా.. అడుగుతున్న వ్యక్తులను మీరెందుకు అడుగుతున్నారని చెప్పినట్టుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.