దారుణం.. అత్యాచారం.. ఆపై సజీవ దహనం...
Published on: Sat May 5, 2018 6:03PM
.jpeg.jpg)
ఉన్నావో, కథువా ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అత్యాచార ఘటనకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టు చట్టాల్లో కూడా కొన్ని మార్పులు చేసింది. కొన్ని కఠిన నిర్ణయాలే తీసుకుంది. అయితే ఈ నిర్ణయాల వల్ల కాస్తయిన పరిస్థితుల్లో మార్పు వస్తుందని అనుకున్నారు కానీ..ఇప్పుడు ఆ ఘటనల తరువాత ఒకదాన్ని మించి మరో ఘోరం, దేశవ్యాప్తంగా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రం ఛాత్రా జిల్లాలోని రాజా కెందువా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై ఆమెను బతికుండగానే నిప్పంటించి హతమార్చారు.
వివరాల ప్రకారం.. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరైన బాలికపై ధను భుయియన్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయగా.. వారు పంచాయితీ నిర్వహించి నిందితుడికి రూ.50 వేల జరిమానా విధించారు. దీంతో ఆ కుటుంబంపై పగ పెట్టుకున్న నిందితుడు... అతని అనుచరులతో కలిసి బాధిత కుటుంబంపై దాడి చేసి ఆమెను సజీవ దహనం చేశారు. ఇక కేసు నమోదుచేసుకున్న పోలీసులు...మొత్తం 18 మందికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు తేల్చి వారిలో 14 మందిని శనివారం అరెస్టు చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.


