నాకో న్యాయం.. నా బావమరిదికో న్యాయమా.. జేసీ ప్రభాకర రెడ్డి సూటి ప్రశ్న 

ఏపీలోని పోలీసు అధికారుల సంఘం, వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపైన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండి పడ్డారు. నా భార్య సోదరుడు అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి.. 3 సార్లు ఎస్పీని దూషిస్తే ఇప్పటివరకు కేసుల్లేవు. కానీ నేను ఏమీ మాట్లాడకపోయినా కడప జైలు నుంచి వస్తుంటే, నేను ఏదో అన్నానని పోలీసు అధికారుల అసోసియేషన్ అంటోంది. కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ ఉంది. "నాకో న్యాయం?… నా బావమరిదికో న్యాయమా? జెండా ఒక్కటే డిఫరెన్స్. నాది పచ్చది.. వాళ్ళది బ్లూ కలర్" అని వ్యాఖ్యానించారు.

 

"పోలీస్ అసోసియేషన్ ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని రోజులు సజ్జల చేతుల్లో ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ఐఏఎస్ ఆఫీసరా? సాక్షి పేపర్‌లో అయన కథలు రాసుకునే వాడు. కథలు రాసేవాడు పోలీసులను ఆదేశిస్తే.. మీరెందుకు ఐఏఎస్, ఐపీఎస్ అవసరమా? ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారు. మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇకనైనా మారండి. అసలు మీరెవ్వరు మా ఇంట్లోకి రావడానికి.. మా ఇంట్లోకి వచ్చి మరీ మాపై కేసులు పెడతారా? పోలీసు అసోసియేషన్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో రూలా?" అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీస్ వ్యవస్థను నిలదీశారు.