ఎన్నికల వైతరిణిని దాటేందుకు తరుణోపాయము లేదా?

 

తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కొత్త రాష్ట్రం ఎపుడెపుడు ఏర్పడుతుందా? ప్రభుత్వం ఎపుడేర్పడుతుందా? ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయా? అని ఆత్రంగా ఎదురు చూస్తుంటే, సీమాంధ్ర నేతల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

 

అధిష్టానం దెబ్బకి పార్టీలో ఉన్నా, పార్టీ మార్చివేరే కండువా కప్పుకొన్నా లేకపోతే సరికొత్త జెండా, సరికొత్త టోపీ, కండువాలు వేసుకొచ్చినా ప్రజలు మాత్రం తమని గుర్తుపత్తేయడం ఖాయమని వారు చాలా దిగులు పడుతున్నారు. ఈ ఎన్నికల వైతరిణిని దాటేందుకు తరుణోపాయమే లేదా?అని వారందరూ బుర్రలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు.

 

అయితే పనబాక, శీలం,పురందేశ్వరి వంటి వారు మాత్రం రోట్లో తలపెట్టాక పోటుకి భయపడుతూ కూర్చుంటే ఎట్లా? అని దైర్యంగా తమ ప్రయత్నాలు తాము చేసుకుపోతున్నారు. కానీ ఇంతకాలం సమైక్యం కోసం మాట్లాడుతున్న నేతలకే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ రాష్ట్ర విభజనని అడ్డుకొంటామని చెప్పిన పాపానికి, విభజన అనివార్యమని స్పష్టం అవుతున్నందున, ప్రజలు వారినే ముందుగా అనుమానించే పరిస్థితులు ఏర్పడటంతో వారు ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్నికలలో ఎలా పోటీ చేయాలని వారు చాలా మధన పడుతున్నారు.

 

అయితే సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి  సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దీనికి తరుణోపాయం కనిపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖ గాలులు వీస్తున్నపటికీ, తమ నియోజక వర్గంపై తమకు పూర్తి పట్టు ఉందని, అందువల్ల వచ్చేఎన్నికలలో తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ జెండా పక్కన బెట్టి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయవచ్చని చెప్పారు. అంటే, ఆయన పార్టీపై ఆధారపడకుండా కేవలం తన శక్తి సామర్ధ్యాలతో గెలిచే ప్రయత్నం చేస్తారు గనుక, ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులను తగ్గించే అవకాశం ఉంది. కనుక అధిష్టానం కూడా దీనిని దిక్కారం క్రింద భావించదు. ఎన్నికల తరువాత ఎలాగు ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూట్లోనే చేరుతారు గనుక ఇందులో పార్టీకి కూడా అభ్యంతరం చెప్పడానికేమి లేదు.

 

అందువల్ల సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఈ ప్రభాకర్-ఫార్ములా తమకేమయినా వర్క్ అవుట్ అవుతుందేమో ఆలోచించుకొంటే మంచిది.