కాంగ్రెస్, టీడీపీ పొత్తు.. జేసీ లాజిక్కు
Published on: Tue Aug 28, 2018 2:46PM
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే పొత్తుల గోల మొదలైంది.. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. కొందరు అసలు కాంగ్రెస్ తో పొత్తు ఏంటి?.. అది టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకోవడంలో తప్పులేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అయితే తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, అసలు ప్రభుత్వం ఏర్పాటు సంగతి అటుంచి ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పలేని స్థితిలో కూడా కాంగ్రెస్ టీడీపీ మద్దతు కోరుతోందని, రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదని అభిప్రాయపడ్డారు.. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, కానీ ఏపీలో అవసరం లేదని జేసీ అన్నారు.. బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటుంది.. కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేమీ ఉండదని అభిప్రాయపడ్డారు.. అలాగే విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటిది ఉందని, పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని అన్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని, అలా చేసినప్పుడు ముస్లింలు పార్టీకి దూరమై ఎక్కడ సీట్లు తగ్గుతాయో అన్న భయంతోనే ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నాడని జేసీ, కేసీఆర్ ను విమర్శించారు.


