జగన్ మా వాడే.. జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం
Published on: Mon Jun 3, 2019 6:25PM

సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసీ వెల్లడించారు.
అదేవిధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి కూడా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మా వాడే అని వ్యాఖ్యానించిన జేసీ.. ఆయనను తాను ఎఫ్పుడూ ద్వేషించలేదని అన్నారు. జగన్ పై తాను కేవలం రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేశానని అన్నారు. జగన్ చిన్నప్పటి నుంచి తనకి తెలుసని, జగన్ తన కుమారుడు స్నేహితుడని.. అందుకే చంద్రబాబు ముందు కూడా తాను జగన్‌ను మావాడు అని సంభోదించేవాడినని గుర్తు చేశారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ సఖ్యతగా వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామమని జేసీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారని.. ఇదే రకంగా ముందుకు సాగితే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని జేసీ అభిప్రాయపడ్డారు.


