జేసీ దివాకర్ రెడ్డి ఉద్వాసనకు సత్తిబాబు ప్రత్యేక శ్రద్ద

 

మనిషి నచ్చకపోతే ‘రామా’ అన్నాతప్పుగా వినిపిస్తుంది. అదే నచ్చితే ఎన్నిమాటలన్నా ముద్దుగానే ఉంటుంది. ఇది అక్షరాల కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా సాగుతున్నతరుణంలో ప్రజాగ్రహానికి, తెరాసకు భయపడి టీ-కాంగ్రెస్ నేతలు చాలామంది కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా గాంధీని కూడా తీవ్రంగా విమర్శించారు. అయితే అప్పటికే బహుశః రాష్ట్ర విభజన చేసేందుకు నిశ్చయించుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణా ప్రకటన చేస్తే వారందరూ దారికి వస్తారనే ఆలోచనతో వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

 

అదేవిధంగా సీమాంధ్ర నేతలు కూడా ఇప్పుడు ఇంచుమించు అటువంటి పరిస్థితే ఎదుర్కొంటూ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే అధిష్టానానికి కళ్ళు చెవులు లేవా? అని నిలదీసారు. అనేక మంది యంపీలు, మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసారు. పార్టీకి అత్యంత విస్వసనీయులన దగ్గ లగడపాటి, ఉండవల్లి వంటివారు మరో అడుగు ముందుకువేసి యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అయినా వారినందరినీ కాంగ్రెస్ అధిష్టానం నేటికీ ఉపేక్షిస్తోంది.

 

కానీ సోనియా గాంధీని పదవి నుండి తప్పుకోమని అడిగినందుకు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ జేసి దివాకర్ రెడ్డికి షో-కాజ్ నోటీసులు జారీ చేసి బయటకి సాగనంపడానికి సిద్దం అవుతోంది. అధిష్టానంపై జేసీ కొంచెం నోరు పారేసుకొన్నవిషయం వాస్తవమే. కానీ, అయన కుటుంబం నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో అనుబంధం కలిగి ఉందనే సంగతిని కూడా విస్మరించి, ఆయనని బయటకి సాగానంపాలనుకోవడం విచిత్రమే.

 

అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రమేయం కంటే పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ అత్యుత్సాహమే ఎక్కువగా కనబడుతోంది. లేకుంటే, మొన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు జేసీని పిలిపించుకొని హెచ్చరికతో సరిబెట్టి ఉండేవారు. పాలెం బస్సు దుర్ఘటన తరువాత నుండి జేసీ, బొత్సల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. అందువల్ల జేసీ దివాకర్ రెడ్డి సోనియాగాంధీని విమర్శించగానే ఇదే అదునుగా బొత్ససత్యనారాయణ పావులు కదిపి జేసీని బయటకి సాగనంపుతున్నారు. కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి నందునే జేసీపై చర్యలు తీసుకొంటున్నామని ఆయన చెప్పడం హాస్యాస్పదమే.