TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జెపి రూట్ మారిందా..?

Published on: Tue Aug 8, 2023 11:37AM

లోకసత్తా జయప్రకాష్ నారాయణ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారా..? ఈ ప్రశ్నకు సమాధానంగా దాదాపు అవుననే వినవస్తుంది. దీనికి కారణం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ కార్యక్రమంలో జగన్, జేపీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడమే. జేపీకి రాజకీయ ఆసక్తి ఉంది. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి మల్కాజిగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు పార్లమెంట్ కు వెళ్లాలన్న ఆసక్తి ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సిపీ అధినేత జగన్ తో  ఆయన ముసి ముసి నవ్వులు.. ముచ్చట్లు.. కొత్త ఊహాగానాలు దారి తీస్తున్నాయి.

లోక్ సత్తాను  ప్రజలను చైతన్యవంతం చేసే సంస్థగా ప్రారంభించి.. ప్రభంజనాన్ని సృష్టించి.. తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు జయప్రకాష్ నారాయణ. 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ రెండు శాతం ఓట్లు సాధించింది. కూకట్ పల్లి  నుంచి పోటీ చేసి పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఆయన ఒక్కరు మాత్రం గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్నుంచీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్న జేపీ ఇటీవల వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్లమెంట్ కు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. లోక్ సత్తా పార్టీని మళ్లీ పునరుద్ధరించి ఆ పార్టీ తరపునపోటీ చేస్తారా లేకపోతే వేరే ఇతర పార్టీలో చేరుతారా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. నిజానికి లోక్ సత్తను రద్దు చేసినట్లుగా జేపీ ప్రకటిచారు కానీ.. ఆ పార్టీ మాజీ నేతలు విడిగా లోక్ సత్తా పేరుతో పార్టీని కొనసాగిస్తున్నారు. కానీ పెద్దగా కార్యకలాపాల్లేవు.

లోక్ సత్తా జేపీ సోషల్ మీడియాతో పాటు మీడియా చర్చల్లో తరచూ పాల్గొంటూ ఉంటారు. ఇటీవల జగన్ ప్రకటించిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు.. ఆ వ్యవస్థను జేపీ సమర్థించారు. ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్కాబ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిజానికి ఆప్కాబ్ కు..   జేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో దశాబ్దాల కిందట ఆప్కాబ్ చైర్మన్ గా పని చేశారని ఆయనను పిలిచారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రభుత్వ కార్యక్రమాల్లో అది కూడా జగన్ తో    కలిసి స్టేజ్ పంచుకోవడంతో ఆయన వైసీపీలో చేరికపై చర్చ ప్రారంభమయింది. వైసీపీలో చేరడమా లేకపోతే వైసీపీ మద్దతుతో విజయవాడ లేదా గుంటూరు ఎంపీగా పోటీ చేయడమా అనే డైలమాలో ఉన్నారని అంటున్నారు.

రెండు, మూడు రోజుల నుంచి జేపీ, వైసీపీ బంధం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నా అటు వైసీపీ కానీ.. ఇటు జయప్రకాష్ నారాయణ వర్గాలు కానీ స్పందించలేదు. ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ లాంటి నేత వస్తే.. వైసీపీ వద్దనే అవకాశం లేదు. చేర్చకుంటారు.. ఎంపీ టిక్కెట్ కూడా ఇస్తారని అంటున్నారు. కానీ జేపీ చేరుతారా అన్నదే కీలకం. ఆయన ఓ మేధావిగా సమాజంలో ఇమేజ్ తెచ్చుకున్నారు. తన పార్టీ కాకపోతే ఆయన తన స్థాయికి తగ్గట్లుగా బీజేపీ వంటి జాతీయ పార్టీలో చేరుతారని అంటున్నారు. కానీ వైసీపీలో ఎందుకు చేరుతారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి..  రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఇరువురూ గుంభనంగా ఉంటున్నారంటే.. ఏదో ఒకటి జరిగినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. అదే గనుక జరిగితే.. జేపీ సొంత ఆదర్శ విలువలు.. సిద్ధాంతాలు.. ఆలోచనలు పక్కన పెట్టి.. వైసీపీ గొంతుకను జేపీ వినిపించాల్సి ఉంటుంది. అలా జయప్రకాశ్ నారాయణ చేస్తారా.. ?