TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అపోలోలో అమ్మ... అయోమయంలో తమిళనాడు!

Published on: Mon Oct 10, 2016 7:02PM

జయలలిత కోలుకుంటోంది. జయలలిత త్వరలోనే సీఎంగా మరోసారి జనం ముందుకు రానుంది. ఇలాంటి వార్తలు గత కొన్ని రోజులుగా వస్తూనే వున్నాయి. అయితే, జనం మాత్రం హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకోవటం లేదు. మరీ ముఖ్యంగా, తమిళనాడులోని పురుచితలైవీ అభిమానులు దినమొక గండంగా గడుపుతున్నారు. మరో వైపు రాజకీయాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. రోజుకో సంచలన వార్త అమ్మ గురించి బయటకొస్తోంది.... 
జయలలిత ప్రాణాపాయం నుంచి బయటపడిందని ఇప్పటికి డాక్టర్లు చెప్పటం లేదు. కాకపోతే, ఆమె ఎలాగైనా దిగ్విజయంగా బయటకొస్తారని అంతా నమ్ముతున్నారు. కాని, ఒకవైపు జయలలిత తిరిగి తమిళనాడు పగ్గాలు పట్టుకుంటారని అంటూనే మరో వైపు ఆమె వారసత్వం కోసం రేసు మొదలైంది. జయలలిత అన్న కూతురు దీప జయకుమార్ హాస్పిటల్ వద్దకి వచ్చి నానా రచ్చ చేసింది. కాని, అన్నాడీఎంకే నేతలు ఆమెని మేనత్త వద్దకి పంపలేదు. మరో వైపు అనూహ్యంగా తమిళ హీరో అజిత్ పేరు కూడా నెక్స్ట్ సీఎం అంటూ వినిపిస్తోంది. జయలలితకు తలా అజిత్ చాలా దగ్గరి వాడవటమే ఈ వదంతలకి కారణం! 
జయలలిత తరువాత సీఎం ఎవరు అన్నది ఇప్పుడే తేలే విషయం కాదు. కాకపోతే, ముందు ముందు మరిన్ని పేర్లు తమిళ సీఎం జాబితాలో కనిపించవచ్చు. మనం ఊహించినవి, ఊహించనవి కూడా అందులో వుండవచ్చు. అయితే, ఇప్పటి వరకూ మార్మోగిపోవాల్సిన పేరు, కాని ఆశ్చర్యకరంగా ఎక్కడా వినిపించనిదీ... శశికళ పేరే!
జయలలిత, శశికళ ఎంత గొప్ప స్నేహితురాళ్లో చెప్పనవసరం లేదు. కాని, ఆ మద్య వారిద్దరికీ కూడా చెడింది. శశికళ దూరంగా వెళ్లిపోయింది. మళ్లీ దగ్గరైంది. అయితే, ప్రస్తుతం ఎవ్వర్నీ జయలలిత వద్దకు వెళ్లనీయకపోయినా కేవలం శశికళ మాత్రం ఐసీయూలో వుంటుందోట. అంత దగ్గరగా వుంటోన్న ఆమె ఏదో ఒకటి చేస్తుందని భయపడేవారు కూడా చాలా మంది వున్నారు. తాజాగా అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ పుష్పా శశికళ పేరు చెప్పుకుండా ఎవరైనా జయ సంతకం ఫోర్జరీ చేయవచ్చని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే కాదు , గవర్నర్ , స్పీకర్ వంటి వారికి కూడా పుష్ప కంప్లైంట్ ఇస్తోంది. జయ సంతకంతో ఏదైనా లెటర్ కీలక నిర్ణయం వెల్లడిస్తూ వస్తే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోమంటోంది... 
పుష్ప భయానికి కారణం శశికళే. ఆమె జయ సంతకం కాపీ చేసి పార్టీపైన, ప్రభుత్వంపైన పట్టుసాధిస్తుందని ఆమె అంటోంది. అది నిజం అయ్యే అవకాశాలూ లేకపోలేదు. కాకపోతే జయ అనారోగ్యం ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె చుట్టూ వున్న వారి జీవితాల్నే కాకుండా మొత్తం తమిళనాడునే అతలాకుతలం చేసేస్తోంది...