అమ్మను ఆస్పత్రిలో చేర్పించే రోజు ఏం జరిగిందంటే...? నిజం చెప్పిన శశికళ..

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను ఆస్పత్రిలో చేర్పించినప్పుటి నుండి... ఆమె మరణించినంత వరకూ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక్క శశికళకు తప్ప. కనీసం పార్టీ నేతలకు కూడా అనుమతి లేకుండా.. చాలా రహస్యంగా జయలలితకు చికిత్స చేశారు. అందుకే కొంతమంది అసలు జయలలితను శశికళే చంపింది అని ఆరోపణలు కూడా చేశారు. ఆ తరువాత ఇంకా ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి కానీ.. వాటికి సమాధానం మాత్రం లేదు. అనారోగ్య కారణాల వల్లే ఆమె చనిపోయారని వైద్యులు చెబుతున్నప్పటికీ.. అమ్మ మరణం వెనుక కుట్ర ఉందని కొందరు అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పడు జయలలితను ఆసుపత్రిలో చేర్చిన రోజు ఏం జరిగిందో శశికళ చెప్పారు.

 

ఆమె మృతిపై దర్యాప్తు చేసేందుకు న్యాయస్థానం జస్టిస్‌ అరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ వేసింది. ఆ విచారణలో ఆమె ఏం చెప్పిందంటే..‘సెప్టెంబరు 22, 2016 రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జయలలిత బ్రష్‌ చేసుకునేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లారు. అప్పటికే ఆమెకు జ్వరం బాగా ఉంది. బాత్‌రూంలో ఆమె కిందపడిపోవడంతో సాయం పట్టమని నన్ను పిలిచారు. నేను వెంటనే వెళ్లి జయలలితను బాత్‌రూం నుంచి తీసుకొచ్చి బెడ్‌ మీద పడుకోబెట్టాను. అంతలో ఆమె స్పృహ కోల్పోయారు. దీంతో నేను మా బంధువైన డాక్టర్‌ శివకుమార్‌కు ఫోన్‌ చేశాను. డాక్టర్‌ వచ్చి జయలలితను పరీక్షించారు.  ఆ తర్వాత అపోలో ఆసుపత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి భర్త విజయ్‌కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపమని కోరారు’. ‘15 నిమిషాల్లో రెండు అంబులెన్స్‌లు వచ్చాయి. జయలలితను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. మార్గ మధ్యంలో ఆమెకు స్పృహ వచ్చింది. ఎక్కడకు వెళ్తున్నాం అని అడిగితే ఆసుప్రతికి అని చెప్పాను. ఆ రోజు ఉదయమే డాక్టర్‌ శివకుమార్‌ జయలలితను రెండు సార్లు పరీక్షించారు. ఆసుప్రతికి రావాలని చెప్పినా అందుకు అమ్మ ఒప్పుకోలేదు. జ్వరం ఎక్కువవడంతో రాత్రి స్పృహ కోల్పోయారు’ అని శశికళ చెప్పారు.

 

ఇంకా  ఆసుపత్రిలో ఉన్న సమయంలో జయలలితను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదంట కదా అని అడుగగా.. దానికి.. అది అవాస్తవమని..అక్టోబరు 22, 2016న అప్పటి రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు జయలలితను చూశారు. ‘అప్పుడు అమ్మ గవర్నర్‌ను చూసి చేయి పైకెత్తిందట... ఈ విషయాన్ని గవర్నరే నాతో చెప్పారు’ అని అన్నారు.  సెప్టెంబరు 22-27 మధ్య అన్నాడీఎంకే నేతలు పన్నీర్‌సెల్వం, తంబిదురై, విజయ భాస్కర్‌ ఆమెను చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత కూడా కొందరు నేతలు జయలలితను చూసినట్టు తెలిపారు. ఏది ఏమైనా జయలలిత మరణం మిస్టరీగా మారడం బాధాకరమైన విషయం. చూద్దాం.. శశికళ చెప్పింది నిజమో..కాదో...?