"అమ్మ" లేని ఏడాదిలో తమిళనాడులో ఏం జరిగింది..!!



ఎంతమంది ఉన్నా అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరని పెద్దలు అంటూ ఉంటారు.. ఇది కన్నతల్లి విషయంలో.. కానీ తమిళనాడు విషయానికి వచ్చే సరికి అక్కడి జనాలకి కన్నతల్లి అంటే జయలలితే. తమను కన్నబిడ్డల్లా పాలించి అమ్మ అంటే వారికి పంచ ప్రాణాలు.. అమ్మ కనుసైగలే ఆదేశాలు.. అమ్మ కోసం ఏమైనా చేస్తాం అనేవారు ఆ రాష్ట్రంలో సగానికిపైగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అమ్మ కోసం గుడులు, అమ్మకి ఏమైనా అయితే పూజలు.. అంతేందుకు ఆవిడకే పూజలు చేశారు తమిళులు.. ఇప్పుడు ఆ అమ్మ లేదు. డిసెంబర్ 5.. తమిళనాడు ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించిన రోజు. ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరని వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణించి సరిగ్గా నేటికి ఏడాది. ఈ సంవత్సర కాలంలో అమ్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అప్పుడు తలెత్తిన అనిశ్చిత పరిస్థితి నేటి వరకు సర్దుకోలేదు. అవేంటో ఒకసారి చూస్తే:

 

* జయ ఉండగా తమిళనాడు వైపు కన్నెత్తి చూడటానికి భయపడిన వారు, ఆమె మరణం తర్వాత అన్నాడీఎంకే వ్యవహారాల్లోనూ.. ప్రభుత్వంలోనూ నేరుగా వేలు పెట్టేస్తున్నారు.

 

* అక్రమాస్తుల కేసులో భాగంగా ఐటీ శాఖ తమిళనాడు సచివాలయంలో సోదాలు నిర్వహించింది.. వీఐపీలు సహా ఏకంగా చీఫ్ సెక్రటరీ నివాసంలోనే సోదాలు చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ఒక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఐటీ శాఖ సచివాలయంలో దాడులు నిర్వహించడం ఇదే ప్రథమం.

 

* జయలలిత అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెరచాటు వ్యవహారాలు నడిపిన.. ఆమె నెచ్చెలి శశికళ అమ్మ మరణం తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పావులు కదిపారు. తొలుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చిన్నమ్మ... సీఎం పీఠాన్ని ఎక్కేందుకు అత్యంత చాకచాక్యంగా వ్యవహారించారు. ఇక తాను ముఖ్యమంత్రి కావడమే తరువాయి అనుకుంటున్న సమయంలో.. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో.. శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

 

* చిన్నమ్మ రాజకీయాల కారణంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. అమ్మ విధేయుడు పన్నీర్ సెల్వం, శశికళ కూర్చొబెట్టిన పళనిస్వామి తమ మద్ధతుదారులతో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ రెండు వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయా అని తమిళనాట తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ చిన్నమ్మ జైలుకెళ్లిన కొద్దిరోజుల్లోనే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు కలిసిపోయాయి.

 

* జయలలితకు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉండటంతో వాటిని దక్కించుకునేందుకు.. అమ్మ వారసులమంటూ ఒక్కొక్కరు తెరపైకి వచ్చారు. తాజాగా బెంగళూరుకు చెందిన అమృత తాను జయ కుమార్తెనంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

 

* అన్నాడీఎంకేలోని అంతర్గత కుమ్ములాటలను క్యాష్ చేసుకొని.. తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలు పావులు కదుపుతున్నాయి.