వైకాపాపై జయలలిత కేసు ఎఫెక్ట్

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపింపబడి జైలుకు వెళ్ళిన తరువాత, సహజంగానే అందరి దృష్టి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళింది. ఆయనపై సీబీఐ ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. వాటిలో ప్రతీదీ కూడా చాలా తీవ్ర నేరారోపణలతో కూడుకొన్నదే కనుక వాటిలో ఏ ఒక్క కేసులో ఆయన దోషిగా తేలినా మళ్ళీ ఆయన జైలులోకి వెళ్ళక తప్పదని అందరికీ తెలుసు.

 

ఈ కేసుల వ్యవహారంలో ఆయన తరచూ కోర్టుకి వెళ్లి వస్తున్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జయలలిత జైలుకి వెళ్ళినప్పటి నుండి అందరిరూ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్, ఆయన పార్టీ భవిష్యత్, ఆ పార్టీని నమ్ముకొన్నవారి భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందనే ఆలోచిస్తున్నారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, వైకాపా యం.యల్.ఏ.లు, నేతలలో తమ రాజకీయ భవిష్యత్ పట్ల ఆందోళన నెలకొని ఉండవచ్చును. ఒకవేళ ఈరోజు కర్ణాటక హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టు కూడా ఆమెకు అదే శిక్ష ఖరారు చేసినట్లయితే అది నేరుగా వైకాపా నేతలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడీ చెప్పిన అనేక అంశాలను క్రమంగా ఇప్పుడు అమలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అవినీతినిపరులపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో అందరికీ తెలుసు. మోడీ తమ పార్టీ కేంద్రంలో అధికారం చేప్పట్టిన ఏడాదిలోగానే అవినీతి కేసులపై విచారణ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లే అధికారం చేప్పట్టిన వెంటనే రాజకీయ నేతలు విదేశాలలో దాచిన నల్లధనాన్ని వెలికి తీసేందుకు నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ సుప్రీంకోర్టుకి తన తొలి నివేదిక అందించింది కూడా. మోడీ అధికారం చేప్పట్టి ఇప్పటికే నాలుగు నెలలుపైగా గడిచిపోయాయి కనుక నేడో రేపో జగన్మోహన్ రెడ్డి యొక్క సీబీఐ కేసుల విచారణ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చును.

 

ఆయనపై సీబీఐ కేసులే కాక ఇంకా డిల్లీలో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కేసులు కూడా సాగుతున్నాయి. కేంద్రం సహాయ సహకారాలు లేకపోతే వీటన్నిటి నుండి తప్పించుకోవడం కష్టమేనని చెప్పవచ్చును. కానీ  ఈ కేసులలో కేంద్రం ఆయనకు సహాయపడే అవకాశం లేదని స్పష్టమవుతోంది కనుక ఆయన మంచి లాయర్లు పెట్టుకొని ఈ కేసులలో ఏ ఒక్కటి కూడా విచారణ ముగియకుండా ఎంతకాలం సాగదీయగలరనే దానిపైనే ఆయన భవిష్యత్, ఆయన పార్టీ భవిష్యత్, పార్టీ నేతల భవిష్యత్ ఆధారపడుందని అర్ధమవుతోంది.

 

రాజకీయనేతలెవరూ కూడా తమ భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడితే ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉండబోరు. ఎన్నికల ముందు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు దూకేసిన నేతలు దానిని నిరూపించి చూపారు. వైకాపా అధికారంలోకి వస్తుందనే అంచనాలతో ఆ పార్టీలోకి చేరిన నేతలు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కేసులు వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని అనుమానం కలిగిన మరుక్షణమే ఆ పార్టీలో నుండి బయటకు దూకేయడం తధ్యం.

 

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంది కనుకనే ఆపార్టీ అధ్యక్షురాలు జయలలిత జైలుకి వెళ్ళినా ఆ పార్టీ నేతలు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. కానీ రాష్ట్రంలో వైకాపా అధికారంలో లేదు. ప్రతిపక్షంలో ఉంది. మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు కూడా రావు. కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డిపై కేసుల విచారణ వేగవంతమయినట్లయితే వైకాపా నేతలు నమ్మకంగా ఆ పార్టీని అంటిపెట్టుకొనే ఉంటారని భావించలేము. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకవేళ జయలలిత పరిస్థితే ఎదురయినట్లయితే పార్టీని కాపాడుకొనేందుకు అవసరమయిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.