జ‌యా బ‌చ్చ‌న్‌ అగ్గిమీద‌ గుగ్గిలం!

జ‌యాబ‌చ్చ‌న్‌..డెబ్బ‌య్ రెండేళ్ల రాజ్య‌స‌భ స‌భ్యురాలు..అంటే పెద్ద‌ల స‌భ‌లో స‌భ్యురాల‌న్న మాట‌. అంటే ఆమె ఏమి చెప్పినా పెద్ద‌రికంతో చెప్పిన‌ట్ట‌న్న‌మాట‌! పెద్ద‌రికంతో చెప్పాలి కాబ‌ట్టి..క‌నీసం అలా చెప్పిన‌ట్ట‌యినా అనిపించాలి కాబ‌ట్టేమో ఆమె ఆచితూచి మాట్లాడుతుంటారు. ఆమాట‌కొస్తే ఆచితూచే స‌భ‌కూ వ‌స్తుంటారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే ఏదైనా చెప్పాల‌నుకున్న‌ప్పుడే స‌భ‌కు వ‌స్తుంటార‌ని అనుకునేవాళ్లూ ఉన్నారు! అలానే మంగ‌ళ‌వారం నాడు స‌భ‌కి వ‌చ్చారు. ఆమె వ‌చ్చారంటే ఏదో పెద్ద విష‌య‌మే ఆమె మాట్లాడ‌తార‌ని అనుకోవ‌చ్చు. అలాగే ఒక పెద్ద విష‌య‌మే లేవ‌నెత్తారు. ఏదో కొంద‌రి కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ మొత్తాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆమె ఆక్రోశించారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ,భోజ్‌పురి న‌టుడు ర‌వి కిష‌న్ మీద అగ్గిగుగ్గిల‌మే అయ్యారు. సినీ ప‌రిశ్ర‌మ అన‌గానే సోష‌ల్ మీడియా ఒంటికాలికి మీదికి లేస్తుంద‌ని, ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు వీస‌మెత్తు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.

 

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం చెల‌రేగి సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో ఆమె ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటున్న‌ది. మాద‌క ద్ర‌వ్యాల‌ను ఎవ‌రో కొంద‌రు వాడుతున్నంత మాత్రాన మొత్తం ప‌రిశ్ర‌మ‌నే వేలెత్తి చూపుతారా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. అంత సీనియ‌ర్ స‌భ్యురాలు స‌భ‌లో ఈ అంశాన్ని ఈ కోణంలో ప్ర‌స్తావించ‌డాన్ని సినీ అభిమానులు ఏమాత్రం జీర్ణం చేసుకోలేక‌పోతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని డ్ర‌గ్స్ మాఫియా భ‌ర‌తం ప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేసి ఉంటే యావ‌త్ ప్ర‌జానీకం సంతోషించి ఉండేవారు. సుశాంత్ లాంటి యువ‌త‌రాన్ని బ‌ల‌గొంటున్న డ్ర‌గ్స్ మాఫియా ఊసెత్త‌కుండా దాన్ని ఎవ‌రో కొంద‌రికే ప‌రిమిత‌మైన అంశంగా ఆమె భావించ‌డం రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఆమె స్ధాయికి త‌గిన‌ట్టుగా లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. మ‌రో న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇప్ప‌టికే కొంద‌రి పేర్లు ప్ర‌స్తావించి, వారు ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని ఇచ్చిన పిలుపికి జ‌యాబ‌చ్చ‌న్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఇక్క‌డ గుర్తించాల్సిన అంశం. కంగ‌నా ర‌నౌత్ బ‌హిరంగంగా పేర్లు ప్ర‌స్తావించిన‌ప్పుడు యావ‌త్ బాలీవుడ్ మౌన‌మే వ‌హించింది. అంటే దాన‌ర్ధం ఏమిటి? ఆ పెద్ద‌వాళ్ల గొడ‌వ‌లో వేలు పెట్ట‌డం ఇష్టం లేద‌నా? లేక కంగ‌నా లేవ‌నెత్తిన అంశంలో వాస్త‌వం ఉంద‌నా? ఇంకా చెప్పాలంటే సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ మాఫియా గురించి కంగ‌నాయే ధైర్యంగా నోరెత్తింది. ఆమెకి త‌గినంత మ‌ద్ద‌తు రాలేదు. 

 

ఇంక మ‌రో విష‌యం. కంగ‌నా ర‌నౌత్ ముంబాయి ఆఫీసు వివాదాస్ప‌ద‌మై ఇర‌వై నాలుగ్గంట‌ల్లో ముంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఆమె ఆఫీసు భ‌వ‌నంలో కొంత భాగాన్ని ఆగ‌మేఘాల మీద కూల్చివేసిన‌ప్పుడూ జ‌యాబ‌చ్చ‌న్ నోరు మెద‌ప‌లేదు. మ‌రి కంగ‌నా ర‌నౌత్ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌గా ఎదిగింది. త‌న‌కంటూ సొంత వ్య‌క్తిత్వంతో బాలీవుడ్‌లో నిల‌బ‌డింది. అటువంటి న‌టికి సంఘీభావంగా నిల‌బ‌డాల్సిన స్ధాయిలో ఉండి కూడా జ‌యాబ‌చ్చ‌న్ అస‌లా అంశం త‌న‌కు సంబంధించ‌నిదిగానే వ్య‌వ‌హ‌రించారు. కంగ‌నా ర‌నౌత్ మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వంతోనే యుద్దానికి త‌ల‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే కుమారడు ఆదిత్య థాక్రేకు మాద‌క ద్ర‌వ్యాల మాఫియాతో లింకులు న్నాయ‌ని ఆమె నేరుగా ఆరోపించారు. అయితే అది ప్ర‌భుత్వంతో ముడిప‌డి ఉన్న అంశం అయినందున జ‌యాబ‌చ్చ‌న్ ఆ విష‌యం జోలికి వెళ్ల‌లేదు. నిజానికి రాజ్య‌స‌భ‌లో ఆమె ఈ అంశాన్ని కూడా ప్ర‌స్తావించి ఉండాల్సింది. ద‌ర్యాప్తుకి డిమాండ్ చేసి ఉండొచ్చు. కంగ‌నా ర‌నౌత్ మీద రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల్ని నిలువ‌రించాల‌ని గొంతెత్తి ఉండాల్సింది. కాని ఇవేమీ జ‌ర‌గ‌లేదు. సినీ ప‌రిశ్ర‌మ గురించి ఒక సినీ న‌టుడే అలా మాట్లాడ‌టం శోచ‌నీయం అంటూ ర‌వి కిష‌న్ వ్యాఖ్య‌ల గురించి ప్ర‌స్తావించారు. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ తీవ్ర‌త గురించి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ప్ర‌సారం చేస్తున్న ప్ర‌సార మాధ్య‌మాల‌ను ఆమె త‌ప్పుబ‌డుతున్నారు. 

 

జ‌రుగుతున్న వాస్త‌వాల‌ను అర‌చెయ్యి అడ్డుపెట్టా ఆపాల‌ని ఆమె భావిస్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. సుశాంత్ మ‌ర‌ణం కేసు ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌దో ఆమెకి తెలీద‌ని అనుకోలేము. అలా మ‌లుపులు తిర‌గ‌డంలోని ఉచితానుచితాల గురించీ ఆమెకు ప్రాథ‌మిక స‌మాచారమైనా తెలీద‌నీ భావించ‌లేము. సుశాంత్ కేసులో అది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అని తేల్చాల్సిన త‌రుణంలో కేసు ఆ ప‌రిధిని ఎప్పుడో దాటిపోయిన‌ట్టు అనిపిస్తున్న‌ది. ఎందుక‌లా జ‌రిగిందో ఎవ్వ‌రూ అడ‌గ‌డం లేదు. ఇప్పుడ‌ది మాద‌క ద్ర‌వ్యాల వాడ‌కం ద‌గ్గ‌ర‌కొచ్చి రియాను, ఆమె సోద‌రుణ్ని అరెస్టు ఘ‌ట్టం ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి ఆపింది. ఇన్ని మ‌లుపుల నేప‌థ్యంలో జ‌యాబ‌చ్చ‌న్ సినీప‌రిశ్ర‌మ ద‌య‌నీయ‌ప‌రిస్థితి గురించి ఆందోళ‌న ప‌డ‌టం క‌న్నా, నిజానిజాల వెలికితీత‌కు ప‌ట్టుబ‌ట్టి ఉండాల్సింది!

-రాజా రామ్మోహ‌న్ రాయ్‌