పీపీఏల పున:సమీక్ష.. జగన్ సర్కారుకు జపాన్ ఘాటు లేఖ!

 

ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ పీపీఏ ఒప్పందాలను సమీక్షిస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ సర్కారు హయాంలో భారీ ధరలకు పీపీఏలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగిందని వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇటీవల కేంద్ర ఇంధన శాఖ అభ్యంతరం వ్యక్తం చేయగా, తాజాగా జపాన్ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది.

విద్యుత్ పీపీఏలను పున:సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని జపాన్ తెలిపింది. ఇప్పటికే మనుగడలో ఉన్న విద్యుత్ పీపీఏల జోలికి వెళ్లడం ఎందుకని ప్రశ్నించింది. భారత పునరుత్పాదక విద్యుత్ రంగంలో జపాన్ కు చెందిన ఎస్ బీ ఎనర్జీ, రెన్యూ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ దౌత్య కార్యాలయం ఈ విషయమై కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖలు రాసింది.

సైన్ అండ్ సీల్ చేసిన కాంట్రాక్ట్‌లను రివ్యూ చేయడం వల్ల పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం చూపుతుందని జపాన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలతో ఫారిన్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొంటాయన్నారు. ఇండియా రెన్యూవబుల్ సెక్టార్‌లో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ భారీగా వస్తున్నాయని.. ఇలాంటి సమయంలో నిర్ణయం సరైంది కాదన్నారు.

ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి పలు వర్గాల నుంచి లేఖలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఒప్పందాల విషయంలో సమీక్షలు, రద్దు చేయడం వల్ల దేశీయంగా విదేశీ పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపింది. ఇప్పటికే పలు కంపెనీలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించాయి. మొత్తానికి రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్‌ల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకత వస్తోంది.