అంతర్జాతీయస్థాయిలో ఏపీకి మచ్చ... జగన్ కు షాకిచ్చిన జపాన్

 

నలుగురికి నచ్చినది నాకసలె నచ్చదురో... నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో... పొగరని ఎందరు అన్నా అది నా నైజం... తెగువని కొందరు అన్నా అది నా మేనరిజమ్... నేను ఒక్కడిని ఒకవైపు... లోకం ఒకవైపు... ఈ లిరిక్స్ ...ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతాయేమో... ఎందుకంటే, రివర్స్ టెండరింగ్... పీపీఏల పునసమీక్షను అటు కేంద్రం... ఇటు పెట్టుబడిదారులు వ్యతిరేకిస్తున్నా... తాను మాత్రం వెనక్కితగ్గేది లేదంటున్నారు. అయితే, చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం చేస్తూ... రాష్ట్రాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇప్పటికే రివర్స్ టెండరింగ్ పై ఢిల్లీ స్థాయిలో రచ్చరచ్చ జరుగుతుంటే, ఇప్పుడు పీపీఏలపై అంతర్జాతీయస్థాయిలో ఏపీపై మచ్చపడేలా కనిపిస్తోంది. ఎందుకంటే, పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్ ల విషయంలో జపాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత ప్రభుత్వానికి, ఏపీ సర్కారు ఒకేసారి లేఖలు రాసిన జపాన్.... సైన్ అండ్ సీల్ చేసిన కాంట్రాక్టులను రివ్యూ చేస్తే పెట్టుబడుల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ హెచ్చరించింది. ఇలాంటి చర్యలతో ఫారిన్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరుగుతాయని, విశ్వాసం సన్నగిల్లుతుందని అభిప్రాయపడింది. ఇండియా రెన్యూవబుల్ సెక్టార్‌లో పెద్దఎత్తున ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్న సమయంలో... ఇలాంటి నిర్ణయాలు సరైనవి కాదంటూ ఏపీకి జపాన్ సూచించింది.

అయితే, పీపీఏలను పునసమీక్షించాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పలు వర్గాల నుంచి లేఖలు వచ్చాయి. కొన్ని కంపెనీలైతే కోర్టులను సైతం ఆశ్రయించాయి. కేంద్రం సైతం పీపీఏల జోలికి వెళ్లొద్దంటూ రెండుమూడుసార్లు లేఖలు రాసి జగన్ సర్కారుకు సుతిమెత్తగానే అల్టిమేటం ఇఛ్చింది. ఒప్పందాలను సమీక్షించడం లేదా రద్దు చేయడం వల్ల విదేశీ పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. అయితే ఇటీవల విజయవాడలో జరిగిన పెట్టుబడుల అవగాహన సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం జగన్... ఒకవైపు తన నిర్ణయం వివాదాస్పదంగా కనిపిస్తుందంటూనే, మరోవైపు పీపీఏలను సమీక్షించి ధరలను తగ్గించకపోతే, కొత్త పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేమంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

మరి రివర్స్ టెండరింగ్, పీపీఏల పునసమీక్ష విషయంలో కేంద్రం మాట కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... జపాన్ లేఖపై ఎలా రియాక్టవుతారో, ఇన్వెస్టర్లలో ఏవిధంగా నమ్మకం కలిగిస్తారో చూడాలి.