కరోనా చికిత్సలో ఓజోన్.. జపాన్ లో పరిశోధనలు
Published on: Thu Aug 27, 2020 12:36PM

ప్రపంచమంతా జరుగుతున్న పరిశోధనలకు మూలం కరోనాగా మారింది. కరోనా వైరస్ కు ఎన్ని కిరీటాలు ఉన్నాయో అంతకుమించి దాన్ని కొమ్ములు వంచడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఒకవైపు అనేక మార్గాలను అన్వేషిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్ తయారిలో తలమునకలై శ్రమిస్తున్నారు. ఇంకో వైపు పాజిటివ్ వ్యక్తులు తర్వగా కోలుకునేలా చికిత్స అందించడంలో కొత్త విధానాలను కనుగొంటున్నారు.
తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఓజోన్ వాయువుతో వైరస్‌కు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఓజోన్ పొర భూమిని రక్షించినట్లే కరోనా వ్యాధి బారిన పడినవారిని త్వరగా కోలుకునేలా చేస్తుందట. ఓజోన్ వాయువును అతి తక్కువగా సాంద్రతలో ఉపయోగిస్తే వైరస్‌ను చంపడం సాధ్యమవుతుందని జపాన్ లోని పుజిటా హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 0.05 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఓజోన్ వాయువును ఉపయోగించి వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చని వారి పరిశోధనల్లో వెల్లడైంది. చికిత్సలోనే కాదు ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో దీనిని డిస్‌ఇన్‌పెక్టెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని వారు వెల్లడించారు. ఇప్పటికే ఓజోన్ జనరేటర్లను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు జపాన్ లో జరుగుతున్నాయి. ఓజోన్ జనరేటర్ ద్వారా దాదాపు 10 గంటలపాటు తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును ఉపయోగిస్తే వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్టు గుర్తించారు.
ఓజోన్ అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుందని పుజిటా హెల్త్ యూనివర్సిటీ చీఫ్ సైంటిస్ట్ మురాఠా వెల్లడించారు. అధిక తేమ ఉన్న పరిస్థితుల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.


