TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో మరింత బలోపేతానికి జనసేన వ్యూహం.. వైసీపీ మహిళానేతలే టార్గెట్?!

Published on: Wed Jun 24, 2026 10:41AM

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. రానున్న కాలంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే  గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై  ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.  ఆ పార్టీకి చెందిన కీలక  మహిళా నేతలను జనసేనలోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది.  రాజకీయవర్గాలలో విస్తృతంగా జరుగుతున్న చర్చ మేరకు.. 

ఇటీవల పార్లమెంట్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు  కారణంగా కనిపిస్తున్నాయి. గత నెలలో పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చట్టసభల్లో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ అవసరమైన తరుణంలో లోక్‌సభలో  ఈ బిల్లుల ఆమోద ప్రక్రియలో  ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే దీనిని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్లమెంటు ఆమెదం పొందేందుకు ఈ బిల్లులను ఈ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. ఆ బిల్లులు ఇమోదం పొందితే చట్ట సభల్లో స్థానాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకు కేటాయించే స్థానాలను దక్కించుకునే వ్యూహంతో జనసేన వైసీపీ మహిళా నేతలకు తమ పార్టీ తలుపులు బార్లా తెరవాలని నిర్ణయానికి వచ్చినట్ల జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.  

ఈ వ్యూహంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ..  క్షేత్రస్థాయిలో  పట్టున్న మహిళా నేతలను గుర్తించిందని చెబుతున్నారు. వారిలో  వైసీపీలో సరైన ప్రాధాన్యత లేక,  అసంతృప్తితో ఉన్న పలువురు మాజీ మహిళా మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఇప్పటికే జనసేన వర్గాలు  సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.  మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే..  రిజర్వ్ అయ్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్న ఉద్దేశంతో  జనసేన వారికి టికెట్లు ఆఫర్ చేయడం ద్వారా పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.  

అలాగే డీలిమిటేషన్ కూడా ఏపీ రాజకీయాల్లో  మార్పులకు దోహదపడనుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ముందస్తుగా పట్టు సాధించడం అన్ని పార్టీలకూ అనివార్యంగా మారింది. ఈ పునర్విభజన సమయంలోనే మహిళా రిజర్వేషన్ల కోటాను కూడా అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో, జనసేన పార్టీ ఈ  స్ట్రాటజీని తెరపైకి తెచ్చిందంటున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత వైసీపీలో పలువురు మహిళా నేతలు సైలంట్ అయ్యారు.  ఇప్పుడు జనసేన అటువంటి వారిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.  ఇందుకు వారి నుంచి కూడా సానుకూలత వ్యక్తమౌతోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కూటమి హవా,    భవిష్యత్  రాజకీయ అవకాశాల దృష్ట్యా పలువురు వైసీపీ మహిళా నేతలు..  పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.